కర్ణాటకలో 189 మందితో మొదటి జాబితా ప్రకటించిన బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ 189 మందితో తొలి జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో 52 మందికి కొత్తవారికి అవకాశం కల్పించారు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ  నాలుగు రోజులుగా కసరత్తు చేసి ఎట్టకేలకూ జాబితా రూపొందించింది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఇపుడున్న షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యాడ్యురప్ప కుమారుడు బీవై విజయేంద్ర  శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

మంత్రులు బీ శ్రీరాములు బళ్లారి రూరల్ నుంచి,   ఆర్.అశోక పద్మనాభనగర్, కనకపుర స్థానాల్లో   రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో తలపడనున్నారు. మొదటి జాబితాలో  52 మంది కొత్త అభ్యర్థులు,  32 మంది వెనుబడిన వర్గాల  అభ్యర్థులు, 30 మంది షెడ్యుల్ కులాలకు, 20 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు.

9 మంది అభ్యర్థులు డాక్టర్లు, ఐదుగురు న్యాయవాదులు, ఇద్దరు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ,8 మంది మహిళలు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరఫున గెలిచి, తరువాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం సహకరించిన ఎమ్మెల్యేలందరికీ ఈ సారి టికెట్లు లభించినట్లు తెలుస్తోంది.

కాగా, జాబితా తయారీకి ముందు కొందరు సీనియర్లను పోటీ నుంచి తప్పుకోవాలని కోరినట్లు తెలిసింది.  బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ కు సీట్ ఇవ్వడం లేదని చెప్పారు. అంతకు ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప  (74) తాను ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు.

యువతరం కోసం సీనియర్లు రాజకీయాలనుంచి తప్పుకోవడం అనే గొప్ప సంస్కృతి బీజేపీలో ఉందని  ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కొనియాడారు. నిజానికి ఆయన పోటీ చేయబోనని గతంలోనే ప్రకటించినా పోటీ చేయాలని తాము కోరామని, అయితే ఆయన తన క్యాడర్‌తో మాట్లాడాక రాజకీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారని బొమ్మై వెల్లడించారు.

కర్ణాటకలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల వేళ ఇప్పటివరకూ వెయ్యికిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం రూ. 126 కోట్ల నగదుతో పాటు మద్యం, డ్రగ్స్, విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.