మిలటరీ స్టేషన్‍లో కాల్పులు, నలుగురు మృతి

పంజాబ్‍ లోని బఠిండా మిలటరీ స్టేషన్‍లో కాల్పుల కలకలం రేగింది. ప్రధానమైన సైనిక స్థావరంగా ఉన్న ఈ క్యాంపులో బుధవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత బృందాలు వెంటనే స్పందించి సోదాలు చేశాయని, విచారణ కొనసాగుతోందని ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది.

“బఠిండా మిలటరీ స్టేషన్‍ లోపల తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో కాల్పుల ఘటన జరిగింది. స్టేషన్ క్విక్ రియాక్షన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని టీమ్ పరిశీలించి, సీజ్ చేసింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో నాలుగు మరణాలు నమోదయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది” అని ఆర్మీ వెల్లడించింది.

ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మిలటరీ స్టేషన్ ఆఫీసర్స్ మెస్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇక్కడే సైనికుల కుటుంబాలు కూడా నివాసం ఉంటున్నాయి. ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను అక్కడ మోహరించారు. మిటలరీ టీమ్‌లు కాల్పుల తర్వాత పారిపోయిన దుండగుల కోసం గాలిస్తున్నారు. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్‌ సెర్చ్‌ చేస్తున్నారు.

బఠిండా మిలటరీ స్టేషన్‌లో 10వ కోర్‌ కమాండ్‌కు చెందిన సైన్యం ఉంది. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో  ఇన్సాస్  రైఫిల్, బుల్లెట్స్ మిస్ అయినట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ ఘటనకు ఈ రైఫిల్‍నే వినియోగించినట్టు ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. “ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నాం. రెండు రోజుల క్రితం మిస్ అయిన ఇన్సాస్ రైఫిల్ పాత్ర ఈ ఘటనలో ఉందనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నాం” అని ఆర్మీ అధికారులు తెలిపారు.

కాగా, ఓ ఆర్మీ సైనికుడు సహచరులపై కాల్పులకు పాల్పడి ఉండొచ్చని బఠిండా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్‍నీత్ ఖురానా చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దీని వెనుక ఉగ్ర కోణం లేకపోవచ్చని, అంతర్గత విషయమే అయి ఉంటుందని ఆయన తెలిపారు.