తెలుగు గణిత శాస్త్రవేత్తకు అంతర్జాతీయ పురస్కారం

భారతీయ సంతతికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణరావు (సిఆర్ రావు)కు ఆయన 102వ ఏట ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం దక్కింది. గణాంకశాస్త్రంలో ఆయన నిరంతర పరిశోధనలు, ఆవిష్కరణలకు గుర్తింపుగా ఈ రంగంలో ఆయనకు 2023 సంవత్సరపు అంతర్జాతీయ అవార్డు దక్కనుంది.

ఈ పురస్కారం భౌతిక గతిశాస్త్రంలో నోబెల్ పురస్కారంతో సమానం. 75 ఏళ్ల క్రితం రావు గతిశాస్త్రంలో తన ఆలోచనలతో దీనిని మలుపు తిప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ స్టాటిస్టిక్స్‌పై ఆయన విశ్లేషణ ప్రభావం కొనసాగుతూ వస్తోంది. సైన్స్‌పై విశేష రీతిలో పలు ఇతరత్రా పరిశోధనలకు ఆయన ఆవిష్కరణలు దోహదం చేశాయి.

శతాధిక వృద్ధుడైనా ఇప్పటికీ వినూత్న ఆలోచనలతో సాగే రాధాకృష్ణరావు జులైలో కెనడాలోని ఒటావా, ఒంటారియోలో జరిగే అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ ద్వైవార్షిక ప్రపంచ స్థాయి సదస్సులో దీనిని స్వయంగా అందుకుంటారు. ఈ విషయాన్ని స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ తమ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారంతో పాటు ఆయనకు 80,000 డాలర్ల నగదు కూడా బహుకరిస్తారు.

కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీ బులెటిన్‌లో ఆయన 1945లో తమ అధ్యయన పత్రం సమర్పించారు. ఇందులో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. గణాంక శాస్త్రంలో ఆధునికతను రంగరింపచేశారు.  ఇప్పుడు శాస్త్రీయ పరికరాలలో వినియోగిస్తున్న అనేక విస్తృతస్థాయి స్టాలిస్టికల్ టూల్స్ రూపకల్పనకు ఆయన సిద్ధాంతపర పత్రాలు దోహదం చేశాయి. రావు బ్లాక్‌వెల్ థిరోమ్ కూడా స్టాటిస్టిక్స్‌లో వినూత్న రీతుల దారికి వీలు కల్పించింది. సంచలనంగా మారింది.

రావు కర్నాటకలోని హదగలిలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఎక్కువగా గూడురు, నూజివీడు, నందిగామ, విశాఖపట్టణాలలో జరిగింది. ఆంధ్ర యూనివర్శిటీ నుంచి గణితంలో ఎమ్మెస్సీ పట్టా తీసుకున్నారు. స్టాటిస్టిక్స్‌లో 1943లో ఎమ్మెస్సీ డిగ్రీ పొందారు. తరువాత పిహెచ్‌డి, డిఎస్‌సి డిగ్రీలు తీసుకున్నారు.

ఆయన పలు అంతర్జాతీయ అవార్డులు పొందారు. ప్రస్తుతం ఆయన గౌరవ ప్రొఫెసర్‌గా అమెరికాలోని పెన్‌సిల్వినియా, బఫెలోలోని వర్శిటీలలో బాధ్యతల్లో ఉన్నారు. భారత ప్రభుత్వం ఆయనకు 1968లో పద్మభూషణ్ ఇచ్చింది. 2001లో ఆయన అత్యున్నత స్థాయి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు.