అమరావతిలో ఇసుక తవ్వకాలపై సవాళ్ల రాజకీయం

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ఉద్రేకాలు వ్యాపిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఆధిపత్య పోరులు తీవ్రమవుతున్నాయి. ఇటీవల పుట్టపర్తిలో సవాళ్ల రాజకీయం వేడి పుట్టించగా  తాజాగా అందుకు అమరావతి వేదికైంది. ఇసుక తవ్వకాలపై వైసీపీ, టీడీపీ సవాళ్లతో పెదకూరపాడు నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫలితంగా 144 సెక్షన్ విధించిన పోలీసులు టీడీపీ మాజీ ఎమ్మెల్యీ శ్రీధర్ ను అరెస్ట్ చేశారు.

అమరావతి వద్ద ఉన్న కృష్ణానది నీటి గుంటలో పడి ఇద్దరు విద్యార్థులు ఇటీవల మృతి చెందారు. దీనిపై వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య ఆరోపణలు గుప్పించుకన్నారు. ఫలితంగా ఇరు పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలైంది. ఇసుక తవ్వకాలపై వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సవాల్‌ విసురుకున్నారు. సోషల్ మీడియాలోనూ తెగ పోస్టులు చేశారు.

 ఇసుకు తవ్వకాల్లో తన ప్రమేయాన్ని నిరూపించాలని వైసీపీ ఎమ్మెల్యే సవాల్‌ స్వీకరించారు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్. అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయాన్ని వేదిక చేసుకున్నారు. ఇందుకు ఇద్దరు నేతలు సై అనటంతో ఆదివారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆలయం వద్దకు ఇరు పార్టీల కార్యకర్తలు బయల్దేరారు.

 రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆలయానికి బయల్దేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తీరును ఖండిస్తూ టీడీపీ శ్రేణలు ఆందోళనకు దిగారు. ఓ దశలో లాఠీఛార్జ్ చేశారు.

మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు ఆలయం వద్ద హల్ చల్ చేశారు. శ్రీధర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజానికి రాత్రి నుంచే టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తూ వచ్చారు పోలీసులు. నేతల ఇళ్ల వద్ద పోలీసు పహారా ముమ్మరం చేశారు. ప్రస్తుతం అమరావతిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

ఇటీవల పుట్టపర్తి నియోజకవర్గంలోనూ ఇదే తరహా దృశ్యం తెరపైకి వచ్చింది. నియోజకవర్గ అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సవాళ్లు విసిరుకున్నారు. సత్తెమ్మ టెంపుల్ వద్ద ప్రమాణానికి రావాలంటూ ఇరువురు పిలుపునిచ్చారు. దీంతో ఇరు పార్టీల కేడర్ గా భారీగా ఆలయం వద్దకు చేరే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో దాడి చేసుకున్న సంగతి తెలిసిందే.