తైవాన్‌ను చుట్టుముట్టిన చైనా యుద్ధ నౌకలు, ఫెటర్‌ జెట్స్‌

చైనా యుద్ధ నౌకలు, ఫెటర్‌ జెట్స్ తైవాన్‌ను చుట్టుముట్టాయి. శనివారం అక్కడ భారీ స్థాయిలో మిలిటరీ డ్రిల్‌ను చైనాకు చెందిన పీపుల్స్‌ లేబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) నిర్వహించింది.  తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ ఇటీవల అమెరికాలో పర్యటించారు. హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీతో కాలిఫోర్నియాలో ఆమె సమావేశమయ్యారు. తైవాన్‌ స్వీయ పరిపాలన, ప్రజాస్వామ్యానికి కెవిన్‌ సంఘీభావం తెలిపారు.

ఈ పరిణామాలతో చైనా మరింత దూకుడు పెంచింది.  తైవాన్ తమ ప్రాంతంగా వాదిస్తున్న చైనా, తైవాన్‌ అధ్యక్షురాలి అమెరికా పర్యటనపై గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం పెద్ద సంఖ్యలో చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు తైవాన్‌ ద్వీపాన్ని చుట్టుముట్టాయి. ఎనిమిది చైనీస్ యుద్ధ నౌకలు, 42 ఫైటర్ జెట్లతో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది.

చైనా యుద్ధ విమానాలు తమ రక్షణ గుర్తింపు జోన్‌లోకి ప్రవేశించినట్లు తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఒకే రోజు చైనా ఫైటర్‌ జెట్లు అధిక సంఖ్యలో ఈ జోన్‌లోకి రావడం ఇదే తొలిసారని పేర్కొంది.  కాగా, చైనా పీఎల్‌ఏకు చెందిన తూర్పు థియేటర్ కమాండ్  తైవాన్ జలసంధిలో ‘జాయింట్ స్వోర్డ్’ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. ఈ నెల 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు భారీ స్థాయిలో మిలిటరీ డ్రిల్‌ను చేపడుతున్నది.

దీని కోసం దీర్ఘ శ్రేణి రాకెట్లు, విధ్వంసక నౌకలు, మిస్సైల్‌ బోట్లు, వైమానిక దళ ఫైటర్లు, బాంబర్లు, రీఫ్యూయలర్లు, ఎలాక్ట్రానిక్‌ వార్‌ ఫేర్‌ ఎయిర్‌క్రాఫ్‌ వంటి వాటిని తైవాన్‌ చుట్టూ మోహరించింది.  2022లో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన సందర్భంగా చేపట్టిన మెగా మిలిటరీ డ్రిల్‌ కంటే ఈసారి భారీ స్థాయిలో సైనిక విన్యాసాలను చైనా నిర్వహిస్తున్నది. తద్వారా ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలను చైనా పెంచుతున్నది.