తెలంగాణ ఆత్మీయతను అద్దంపట్టే సినిమా `బలగం’

తెలంగాణ పల్లెల్లోని మనుషులను, వారి మధ్య ఆత్మీయతను కళ్లకు అద్దినట్టు చూపించిన సినిమా ‘బలగం’. టిల్లు వేణు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. ప్రాంతంతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని పాత్రలకు కనెక్ట్ అవుతుండడంతో విడుదలైన రోజు నుంచే ఈ మూవీకి సానుకూల స్పందన వస్తోంది.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అడ్డా. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమా బలగం. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ కంటతడి పెట్టిస్తోంది.  మరుళీధర్ గౌడ్, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రాన్ని చూసిన అందరూ తమ నిజజీవితంలో జరిగి సంఘటనలను మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. ఇక పల్లెల్లో నివసించే వారికైతే ఈ సినిమాగా బాగా నచ్చేసింది. పల్లె ప్రజలకు ఈ మూవీ బాగా నచ్చడంతో థియేటర్లు లేని మారుమూల గ్రామాల్లో, థియేటర్లు లేని ఊర్లల్లో ఈ సినిమాను గ్రామ పంచాయితీల వద్ద  ప్రదర్శనగా వేస్తున్నారు. దీంతో థియేటర్లకు వెళ్లలేని ప్రజలకు ఈ సినిమా చూసే అవకాశం ఏర్పడుతోంది.

ఈ సందర్భంగా గ్రామాల్లో ‘బలగం’ సినిమా ప్రదర్శన వేయిస్తున్నామంటూ స్వయంగా పంచాయితీ అధికారులే దండోరా వేసి ప్రచారం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గత కుటుంబంలో గొడవలు జరిగి విడిపోయిన వాళ్లు కూడా బలగం సిన్మా చూసి ఒక్కటై కలిసిపోతూ తమ బలగాన్ని పెంచుకుంటున్నారు.

కాగా, బలగం సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డును దక్కించుకుంది.  ఆమ్ స్టర్ డామ్ లో ప్రకటించిన ‘ఆరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్’ లో బెస్ట్ డైరెక్టర్ గా వేణు అవార్డు అందుకున్నాడు. మార్చి 3న విడుదలై ఈ చిత్రం ఇప్పటి వరకు 9 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా వేణు తనను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

అటు వాషింగ్టన్ డిసి ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో 4 అవార్డులను, ఒనికో ఫిల్మ్ అవార్డు, లాస్ ఎంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డును సైతం బలగం సినిమా దక్కించుకుంది. బలగం సినిమాను ఖచ్చితంగా ఆస్కార్‌కు పంపించేలా చర్యలు తీసుకుంటానని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు.

ఉగాది సందర్భంగా తెలుగు సినిమా వేదిక నుంచి నంది అవార్డు, లాస్‌ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఐదు రోజుల కింద ఉక్రెయిన్ లోని ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకున్నారు.

అలాగే బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో ఏథెన్స్ ఇంటర్నేషనల్ మంత్లీ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కింది. డిసి ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులను గెలుచుకున్నారు. బెస్ట్ ఫీచర్ డైరెక్టర్, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ కథనం విభాగంలో డీసీ ఇంటర్నేషనల్ సినిమా అవార్డులను ప్రకటించారు.