ముగ్గురు మహానుభావులు … మూడు మార్గాలు

కె. శ్యామ్ ప్రసాద్
సామాజిక సమరసత జాతీయ సంయోజకులు
 
*శ్రీరామకృష్ణులు
 
బెంగాల్ లోని కామార్పకూరు గ్రామంలో గదాధరుడు జన్మించాడు. చిన్న నాటనే భక్తి ఎక్కువ.10 వ ఏట శివరాత్రి సందర్భంగా అతనికి శివుని వేషం వేయించారు.వెంటనే అతనికి స్పృహ పోయింది.ఆ బాలుడు ఇతరులకు శివునిగా కన్పించాడు. ఒక రోజు తరువాత అతనికి బాహ్య స్మృతి కల్గింది. వారే తరువాత కాలంలో శ్రీ రామకృష్ణులుగా “దుర్గామాత” దర్శనం పొందారు.
శివుడే శ్రీ రామకృష్ణులుగా అవతారం ఎత్తారనీ వివేకానందులు అన్నారు. చిన్న నాట శివుని వేషం ధరించగానే “పౌర్ణమి” నాటి చంద్రుని వలె తాను భగవత్ స్వరూపుడను అనే అనుభూతి గధాధరునికి కలిగింది. వీరు భక్తి గుణ సంపన్నులు. వేద వేదాంగాలు చదువుకోలేదు. సరిగ్గా పాఠశాలకే వెళ్ళ లేదు. భగవత్ దర్శనం పొందిన కారణంగా క్లిష్టమైన వేదాంత విషయాలను పామరులకు సైతం సరళంగా వివరించ గల్గిన అద్భుత బోధనా శక్తి వారికి ఉంది.
 
సాత్వికతకు మూర్తీ స్వరూపులు. వీరి కారణంగా పాశ్చాత్య ప్రభావంలో మునిగి తేలుతున్న బెంగాల్, భారత్ లలో సనాతన హిందూ ధర్మం పునార్జాగరణ పొందాయి. వీరి శిష్యులు వివేకానందుల వల్ల జాతీయ భావ జాగరణ, హిందూ ధర్మం పట్ల విశ్వాసం ప్రజల్లో పాదుకుంది.
 
* స్వామి దయానంద సరస్వతి
 
గుజరాత్లో ఒక బాలుడు మూల శంకర్ తివారి జన్మించాడు. చిన్న నాట శివరాత్రి రోజున శివాలయంలో శివ లింగం వద్ద ఉంచిన ప్రసాదాన్ని ఒక ఎలుక తినడం చూసాడు. తనకు పెట్టిన ప్రసాదం ఎలుక తింటూ ఉంటే ఏమి చేయలేని శివుడు, ఆ శివ లింగంలో లేడనీ నిర్ణయానికి వచ్చాడు. అతనే పెద్ద అయ్యాక గొప్ప వేద పండితుడు అయి స్వామి దయానంద సరస్వతి అయ్యారు.
వేద ధర్మ ప్రచారం చేశారు. మూర్తి పూజను వ్యతిరేకించారు. అయితే మహమ్మదీయుల వలె దేవాలయాలను, విగ్రహాలను  విధ్వసం చేయలేదు. వారు గొప్ప పండితులు. పండిత చర్చలో పెట్టింది పేరు. అయితే వారికి భగవత్ దర్శనం లభించలేదు. జ్ఞాన సంపన్నులే, భక్తి పాలు తక్కువే! వారి మితి మీరిన తర్కం సనాతనులకు, సిక్కులకు మధ్య వైమనస్యాన్ని ఏర్పరిచింది. సామాజిక లోపాలను తొలగించి వేద ధర్మ పునరుద్దరణకు కృషి చేశారు.
 
మన ఉపనిషత్తులు “భగవంతుడు మానవునిలో, ప్రకృతిలో అంతా వ్యాపించి ఉన్నాడు”,అని చెబుతున్నాయి.అలాంటప్పుడు గుడిలోని మూర్తిలో దేవుడు లేడా? గుడిలోని మూర్తిలో మాత్రమే దేవుడు ఉన్నాడని అనడం సరి కాదు.
 
* ఇ.వి.రామస్వామి నాయకర్
 
మూడవ వ్యక్తి  తమిళనాడుకు చెందిన  ఇ.వి.రామస్వామి నాయకర్. వీరి తల్లిదండ్రులు దైవ భక్తి పరాయనులు. వీరికి చిన్న నాట దైవభక్తి ఉండేది. ఒక రోజు బాలుడుగా ఉండగా దేవాలయం లోని మూర్తిపై బొద్దింక పాకడం చూసారు. తన దేహం పై బొద్దింక వంటి అల్ప జీవి పాకుతూ ఉంటే తన శరీరంపై నుండి తొలగించు కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు? అసలు దేవుడే లేడు అనే నిర్ణయానికి వచ్చాడు.
 
హిందూ వ్యతిరేక, నాస్తిక ద్రవిడ ఉద్యమానికి తాత్విక సూత్ర ధారుడై “పెరియార్” పేరుని పొందాడు. 60 వ దశకంలో చెన్నై నగర వీధుల్లో శ్రీ రాముని చిత్రపటానికి చెప్పుల దండలు వేసి ఊరేగింపులు చేయించాడు. పెద్ద జీయర్ స్వామీ అక్కడ నుండే శ్రీ రామ యజ్ఞ ఉత్సవాలను దేశమంతటా  111 చోట్ల చేసి దేశంలో తిరిగి ప్రజల్లో రామ భక్తిని మెల్కొల్పారు.
 
పెద్ద జీయర్ స్వామీ రామస్వామి నాయకర్ ను కలిశారు. పెద్ద జీయర్ స్వామి “మీరు మీ మనవడిని ఆనందంగా తల పైకి ఎక్కించు కుంటారు. క్రిందకు తోసి వేయరు కదా! ఆనందిస్తారు కదా!! అలాగే భగవంతుని శరీరంపై బొద్దింక ఎక్కి పాకితే భగవంతునికి ఎందుకు కోపం వస్తుంది?బొద్దింక తన సృష్టిలో భాగమేనని దేవుడు అనందించడా?'” అని చెప్పారు.
 
అప్పుడు రామస్వామి నాయకర్ “నాకు ఆనాడు ఆ రకమైన ఆలోచనే రాలేదు” అని సమాధానం ఇచ్చారు. రామస్వామి నాయకర్ ఏర్పరిచిన తాత్విక భూమిక వల్ల నేడు తమిళనాడు దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక శక్తులకు అడ్డాగా వేర్పాటు భావాలతో సమస్యాత్మకంగా ఉంది. నాస్తిక,ముస్లిం తీవ్రవాద, క్రైస్తవ మత మార్పిడికి తమిళనాడు అడ్డాగా మారింది.

**శ్రీ రామ కృష్ణులు, స్వామి దయానంద సరస్వతి, ఇ.వి.రామ స్వామి నాయకర్ లు ముగ్గురికీ చిన్న నాట కల్గిన అనుభవాలలో సారూప్యత ఉంది. అయితే వారి స్పందనలు మాత్రం వేర్వేరు. ముగ్గురిలో దైవాంశ ఉంది. శ్రీ రామ కృష్ణుని లో దైవాంశ “పౌర్ణమి” నాటి చంద్రుని వలె ఉండగా, రామస్వామి నాయకర్ లో అమావాస్య నాటి చంద్రుని వలె దైవాంశ ఉంది. వారి జీవనాల వల్ల దేశం పై ప్రభావలు వేర్వేరు కదా!ఎవరి ఆలోచనలో దేశానికి మేలు చేశాయి? మీరే నిర్ణయానికి రండి.