సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీం

ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.  దీంతో పత్రిపక్షాలు పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌  విచారణను తిరస్కరించింది. రాజకీయ నాయకులకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.
 
సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు పిటిషన్‌లో ఆరోపించాయి. నాయకుల అరెస్ట్‌, రిమాండ్‌, బెయిల్‌పై నిర్దిష్ట మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కోరాయి.  2013-14 నుంచి 2021-22 వరకు సీబీఐ, ఈడీ కేసులు 600 శాతం పెరిగాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 121 మంది రాజకీయ నేతలను ఈడీ విచారించగా, వారిలో 95 శాతం మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారేనని తెలిపారు.

 అదే సమయంలో 124 సీబీఐ విచారణల్లో 95 శాతానికిపైగా ప్రతిపక్ష పార్టీలకు చెందినవారేనంటూ ప్రతిపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఇది రాజకీయ పగ, పక్షపాతానికి స్పష్టమైన నిదర్శనమని ఆరోపించారు. ఇలాంటివి జరగకుండా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును కోరారు. 

ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ విచారణ ఉండకూడదని చెప్పగలమా? నాయకులను దూరంగా ఉంచగలరా? రాజకీయ నాయకుడు ప్రాథమికంగా పౌరుడని, పౌరులుగా మనమంతా ఒకే చట్టానికి లోబడి ఉంటామని కోర్టు పేర్కొంది. దీనికి సింఘ్వీ స్పందిస్తూ భారతదేశంలో పెండింగ్‌లో ఉన్న ఏ కేసును సైతం ఈ పిటిషన్‌ ప్రభావితం చేయకూడదని, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోమని కూడా కోరడం లేదని చెప్పారు.

ఈ మేరకు కోర్టు సామాన్యులకు, రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించలేమని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రడూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. అయితే, పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు సింఘ్వీ కోర్టును కోరగా.. అనుమతి ఇచ్చింది.