సూరత్ కోర్టులో ఊరట దక్కని రాహుల్

మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అనే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట దక్కలేదు. బెయిల్ ఏప్రిల్ 13 వరకూ పొడిగించింది. అలాగే విచారణను మే 3కు వాయిదా వేసింది. అయితే రాహుల్‌కు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ సెషన్స్ కోర్ట్ నిరాకరించింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై విచారణను మే 3వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది కోర్టు.

తనను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన స్వయంగా సోమవారం సూరత్‍కు చేరుకున్నారు. 2019లో దాఖలైన పరువు నష్టం కేసులో గత నెల 23న దోషిగా  తేలిన ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పు చెప్పింది.

అయితే.. అదే రోజు కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అతని శిక్ష అమలుపై 30 రోజుల స్టే విధించింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవటానికి అవకాశం కల్పించింది కోర్టు. దీని వల్ల ఎంపీగా రాహుల్‍పై అనర్హత వేటు పడింది. దీంతో దోష నిర్ధారణను, శిక్షను నిలుపుదల చేయాలని నేడు సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ అప్పీలు దాఖలు చేశారు.
తన సోదరి, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, చత్తీస్‍గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వేందర్ సింగ్ సుఖు సహా మరికొందరు నాయకులతో కలిసి ఆయన సూరత్‍కు రాహుల్ చేరుకున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీపై దోష నిర్ధారణ, శిక్షపై సెషన్స్ కోర్టు స్టే విధిస్తే ఆయనకు మళ్లీ ఎంపీ పదవి దక్కుతుంది. ఒకవేళ రెండేళ్ల కంటే శిక్ష తగ్గించినా రాహుల్ మళ్లీ ఎంపీ స్థానం పునరుద్ధరణ జరుగుతుంది. వీటిలో ఏదో ఒకటి జరగాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది.
 
పిల్లల చర్యగా కిరణ్ రిజిజు విమర్శ

శిక్షను సవాల్ చేసేందుకు పిటిషన్ వేసేందుకు వ్యక్తిగతంగా సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ రావాల్సిన అవసరం ఏముందని అధికార బీజేపీ విమర్శించింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.

“సవాల్ చేసేందుకు రాహుల్ గాంధీ సూరత్ కోర్టుకు వెళుతుండవచ్చు. కానీ, అప్పీలు దాఖలు చేసేందుకు దోషి స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ దోషి కూడా వ్యక్తిగతంగా వెళ్లరు. అయితే, నాయకుల బృందం, అనుచరులతో రాహుల్ వ్యక్తిగతంగా వెళుతుండడం అంతా డ్రామా” అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

 “కోర్టుపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ప్రయత్నం.. పిల్లల చర్యగా కనిపిస్తోంది. దేశంలోని అన్ని కోర్టులు ఇలాంటి వ్యూహాలను అసలు పట్టించుకోవు” అని రిజిజు పేర్కొన్నారు. అయితే, నాయకులతో రాహుల్ గాంధీ వెళుతుండడం బల ప్రదర్శన కాదని కాంగ్రెస్ అంటోంది. ఆయనకు మద్దతుగా నాయకులు వెళుతున్నారని చెబుతోంది.