ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ  ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు వస్తున్నారని, ఆయన కొన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ  తన పర్యటన సందర్భంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలుకు జెండా ఊపనున్నారు.
 
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే రెండో వందే భారత్ ట్రెయిన్ ఇది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆ రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాట్లు చేయనున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులతో పాటు ఆరు జాతీయ రహదారుల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు.
 
అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్, తిరుపతి మధ్య ఈ రైలును కేటాయించినందుకు కిషన్ రెడ్డి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
 
సాధారణంగా హైదరాబాద్, తిరుపతి మధ్య నడిచే రైళ్లకు 11 గంటలకుపైగా పడుతుంది. అయితే వందే భారత్ రైలు ప్రయాణం తొమ్మిది గంటలకన్నా తక్కువ కాలంలోనే ముగుస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్-తిరుపతి(ట్రైన్ నెంబర్ 20701) సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
మధ్యలో నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలలో మాత్రమే ఈ ట్రైన్ ఆగనుంది. నల్లగొండకు ఉదయం 7.19 గంటలకు, గుంటూరుకు ఉదయం 9.45కు, ఒంగోలుకు ఉదయం 11.08కు, నెల్లూరుకు మధ్యాహ్నం 12.29 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి-సికింద్రాబాద్(ట్రైన్ నెంబర్ 20702) తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ సాయంత్రం 5.20 గంటలకు నెల్లూరు, 6.30కు ఒంగోలు, 7.45కు గుంటూరు, రాత్రి 10.10 గంటలకు నల్లగొండ చేరుకుంటుంది.  కాగా, ఈ నెల 6న దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్ కమిటీలతో ప్రధాని మోదీ  ఇంటరాక్ట్ కానున్నారు. ఇందులో తెలంగాణలోని కొన్ని బూత్ కమిటీలు కూడా ఉన్నాయి.
 
 ఇలా ఉండగా,  మేలో ప్రధాని మోదీ  వరంగల్ లో రైల్వే వ్యాగన్  ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారని బిజెపి వర్గాలు తెలిపాయి. ఇదే పర్యటనలో  భాగంగా ఆయన హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న ఓ సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? ఎంత అప్పు ఇచ్చింది? అనే వివరాలతో కూడిన పుస్తకాన్ని  ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నాయి.