డేటా చోరీ కేసులో 11 కంపెనీలకు నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డేటా చోరీపై విచారణ జరుపుతున్న సైబరాబాద్‌ పోలీసులు పలు కంపెనీలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఇందులో బ్యాంకులతో పాటు ఫైనాన్స్‌ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఓటీటీ సంస్థలు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌, ఈ లెర్నింగ్‌ సెంటర్లకు నోటీసులు ఇచ్చి, వివరణ కోరారు.
 
వ్యక్తిగత డేటా చౌర్యం కేసులో పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు మొబైల్‌ ఫోన్లను పోలీసులు సీజ్‌ చేశారు. నిందితుడు వినయ్‌ భరద్వాజ్‌ వినియోగించిన ల్యాప్‌టాప్‌లలో 66.9కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటాను గుర్తించారు.
 
 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, ఇతర వ్యక్తులతో పాటు చివరికి విద్యార్థుల డేటాను సైతం నిందితుడు విక్రయానికి పెట్టినట్లుగా తేల్చారు. నిందితుడు inspirewebz పేరుతో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి.. దాని తర్వాత దొంగిలించిన డేటాను అవసరమున్న వారికి విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేల్చారు.జీఎస్టీ, పాన్ కార్డ్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టా‌గ్రామ్, బుక్ మై షో, ఆప్ స్టాక్స్ సంస్థల నుంచి, బైజూస్ నుంచి 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను నిందితుడు తీసుకున్నట్లు గుర్తించారు. 24 రాష్ట్రాలు, ఎనిమిది మెట్రో పాలిటన్ సిటీల నుంచి వినయ్ భరద్వాజ డేటా చోరీ చేసినట్లు తెలిపారు.

ఈ వ్యవహారంలో తాజాగా పోలీసులు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మమహీంద్రా సహా పలు ఐటీ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. అలాగే బిగ్‌ బాస్కెట్‌, ఫోన్‌ పే, ఫేస్‌బుక్‌, పాలసీ బజార్‌ సంస్థలకు నోటీసులు ఇచ్చారు. డేటా లీకేజీ వ్యవహారంపై పోలీసులు వివరణ కోరారు.