సిట్ విచారణలో టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనితా రామచంద్రన్

తెలంగాణాలో సంచలనంగా మారిన టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో బోర్డు చైర్మన్, కార్యదర్శి,  సభ్యులను కూడా ప్రశ్నించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించుకుంది. బోర్డు కార్యదర్శి, సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సిట్ విచారణకు కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం సిట్ కార్యాలయంకు చేరుకున్నారు.
 
కార్యదర్శి ఆధీనంలోనే కాన్ఫిడెన్షియల్ విభాగం మొత్తం ఉంటుంది. ఈ క్రమంలో  ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపరచడం పరీక్షలు నిర్వహించడం వాటిపై  అనితను విచారించనుంది.  ఎ1గా ఉన్న ప్రవీణ్ ఆమె వద్ద పిఎగా పని చేస్తున్నారు. గ్రూప్ 1 రాసిన ప్రవీణ్ ను విధుల నుంచి ఎందుకు తప్పించలేదన్న దానిపై అనితను ప్రశ్నించే అవకాశముంది.  
 
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై టిఎస్‌పిఎస్‌సి మెంబర్లను విచారించనుంది. ఈ విచారణలో ఆరుగురు బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్ సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. బోర్డు సభ్యులు సుమిత్రా ఆనంద్ తనోబా, కరమ రవిందర్ రెడ్డి, ఆర్ సత్యనారయణ, రమావత్ ధన్ సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారిలను సిట్ విచారించే అవకాశం ఉంది.
 
టిఎస్‌పిఎస్‌సి సభ్యులను ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్న క్రమంలో కమిషన్‌లో సభ్యుల పాత్ర, పరీక్షల నిర్వహణలో వాళ్ల నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనే వివరాలు తెలుసుకునేందుకు సిట్ బృందం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్, కార్యదర్శి నుంచి సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు.
 
వివిధ ఉద్యోగ నియామక పరీక్షలను ఏ విధంగా నిర్వహిస్తారు? ప్రశ్నాపత్రాలు ఎవరు రూపొందిస్తారు? వాటిని ఎక్కడ భద్రపరుస్తారు? ఎవరెవరి ఆధీనంలో ప్రశ్నాపత్రాలుంటాయి? అనే వివరాలను తెలుసుకుని నమోదు చేసుకున్నారని అంటున్నారు. మరోవైపు టిఎస్‌పిఎస్‌సి పరిపాలనా విభాగం సహాయ కార్యదర్శి సత్యనారాయణతో పాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర లక్ష్మిని ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సాక్ష్యులుగా చేర్చారు.
 
  ఇప్పటికే గ్రూప్ 1 లో100 కు పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులను సిట్ విచారించి వారి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సిట్ 15 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో మరో వారం రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ నివేదిక మరో  వారం రోజుల్లో సిట్ కు అందనుంది.  పూణె నోటిఫైడ్  ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంది.
 
  ఏప్రిల్ 11న పూర్తి దర్యాప్తు నివేదికను సిట్ కోర్ట్ కు  అందజేయనుంది.  పేపర్ లీక్ ద్వారా నిందితుడు ఏ2 రాజశేఖర్  ఎలాంటి లబ్ధి పొంద లేదని భావిస్తోన్న సిట్.. 14 లక్షలకు గాను రూ.4 లక్షలను సీజ్ చేసింది.