‘ది ఎలెఫెంట్ విస్పర్స్’ బృందానికి ప్రధాని మోదీ ప్రశంసలు

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలెఫెంట్ విస్పర్స్’ డాక్యుమెంటరీ బృందం సభ్యుల్లో కొందర్ని ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకుని ప్రశంసలతో అభినందనలు తెలిపారు. ఈ డాక్యుమెంటరీ విజయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, ఈరోజు మేథావులైన ఈ బృందం సభ్యులు కొందరిని కలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని మోదీ ఆనందాన్ని వెలిబుచ్చారు. భారత్‌కు చాలా గర్వకారణమైన ఘనకీర్తి ఈ బృందం తెచ్చిపెట్టిందని కొనియాడారు.
 
ఆ తర్వాత, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తన నివాసంలో ఎలిఫెంట్ విస్పరర్స్ వెనుక ఆస్కార్ విజేత బృందాన్ని కలిశారు. నెట్‌ఫ్లిక్స్ నుండి కార్తికి గోన్సాల్వేస్, దర్శకుడు- సినిమాటోగ్రాఫర్ గునీత్ మూంగా, నిర్మాత మోనికాలతో సమావేశమయ్యారు. భారతదేశపు కథ చెప్పే శక్తి సాటిలేనిదని అంటూ అటువంటి కథకు ఆస్కార్ అవార్డు లభించడం పట్ల కేంద్ర మంత్రి ఆనందాన్ని వ్యక్తంచేశారు.
 
“ఎలిఫెంట్ విస్పరర్స్ హృదయాన్ని కదిలించే, సామాజిక సంబంధితమైన, సినిమాటోగ్రాఫికల్‌గా ఆకట్టుకునే మాస్టర్ పీస్‌తో నిండిన ‘ట్రంక్’! ఈ అద్భుతమైన డాక్యుమెంటరీని రూపొందిస్తున్నప్పుడు గునీత్, కార్తికిని కలుసుకోవడం, వారి అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది” అంటూ సంతోషాన్ని వెలిబుచ్చారు.
 
“ప్రకృతితో మానవులు పంచుకునే సున్నితమైన సమతుల్యతతో పాటుగా మన సామాజిక బాధ్యత, ప్రభావం, పరిరక్షణ పట్ల ప్రయత్నాలను డాక్యుమెంటరీ అందంగా చిత్రీకరిస్తుంది – అత్యంత హృదయపూర్వకంగా నిజంగా ప్రశంసించదగినది” అని తెలిపారు.  “మన ప్రాంతీయ కథనం ప్రపంచవ్యాప్తమైంది. ఇది ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ డబ్ చేయబడి ఆనందించబడుతుంది. భారతదేశం కథలతో కళకళలాడుతోంది. కొత్త తరహా చిత్ర నిర్మాతలు వాటిని సంగ్రహించడానికి తహతహలాడుతున్నారు” అని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
 
ఈ డాక్యుమెంటరీలో వన్యప్రాణుల సంరక్షకుల స్ఫూర్తిదాయకమైన జీవితాల గురించి ప్రస్తావించారని పేర్కొంటూ “నేను తమిళనాడు సందర్శించినప్పుడు ఖచ్చితంగా బొమ్మన్ & బెల్లీని కలవాలని ఆశిస్తున్నాను. వారి జీవితం, పరిరక్షణ ప్రయత్నాలు విశేషమైనవి, స్ఫూర్తిదాయకమైనవి” అంటూ అభినందనలు తెలిపారు.
 
ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రం ఇటీవల 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం అనాథ ఏనుగు పిల్లను చూసుకుంటున్న వృద్ధ జంట బొమ్మన్, బెల్లి జీవితాన్ని అన్వేషిస్తుంది. ముదుమలై నేషనల్ పార్క్‌లో సెట్ చేయబడిన ఈ చిత్రం మానవులు, ఏనుగుల మధ్య ప్రేమపూర్వక బంధాన్ని చోపుతుంది. ఈ విభాగంలో అకాడమీ అవార్డును పొందిన మొదటి భారతీయ చిత్రం.