మౌలిక సదుపాయాలకు ‘మెయిన్‌ డ్రైవర్‌’గా ప్రయివేట్‌ రంగం

రేపటి ఆర్థిక నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయివేట్‌ రంగ పెట్టుబడి ‘మెయిన్‌ డ్రైవర్‌’గా ఉంటుందని జి-20 దేశాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యుజి)-2 సమావేశాలు పేర్కొన్నాయి. విశాఖలోని రాడిషన్‌ బ్లూ హోటల్లో మంగళవారం ప్రారంభమైన ఈ సమావేశాలు బుధవారంతో ముగిశాయి.
 
ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు, నగరాలను ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా చేయడం, పట్టణ మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయంపై దృష్టి కేంద్రీకరించడం, పట్టణ మౌలిక సదుపాయాల నిర్మాణానికి వివిధ అంశాలను గుర్తించడం ప్రధాన అంశాలుగా సమావేశంలో చర్చించారు.
 
ప్రధానంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యయంపై డేటా తయారు చేసి ప్రయివేట్‌రంగ భాగస్వామ్యానికి అనుగుణంగా నివేదికలు రూపొందించడంపై ఈ రెండు రోజుల్లో ఏడు సెషన్స్‌, ఒక వర్క్‌షాప్‌లో ప్రధాన అజెండాగా చర్చలు సాగాయి. నగరాల్లో సమ్మిళిత అభివృద్ధి సదుపాయాల కల్పన ఎలా ఉండాలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వివరించారు.
 
జి-20 దేశాలకు సంబంధించి 14 దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు, ఎనిమిది మంది ఆహ్వానితులు, దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 70 మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. పది అంతర్జాతీయ సంస్థలు కూడా భాగస్వామ్యమయ్యాయి.

రెండు రోజుల సమావేశాల్లో పాల్గన్న జి-20 దేశాల ప్రతినిధుల్లో ఆయా నగరాలు, పట్టణాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల సమీకరణ, ప్రయివేట్‌రంగ భాగస్వామ్యంపై భిన్న నిర్వచనాలు వ్యక్తమయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ సోలోమన్‌ అరోక్యరాజ్‌ తెలిపారు.

 
 జి-20 సమావేశాల ముగింపు సందర్భంగా  విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాలు, పట్టణాల ప్రాజెక్టులు, వ్యయాలు, వనరుల సమీకరణ తదితర అంశాల ఆధారంగా ప్రయివేట్‌ భాగస్వామ్యం పాత్ర ఉంటుందని నిర్ణయించినట్లు చెప్పారు.
 
నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ జియోగ్రఫీ (ఐఎన్‌ఇజిఐ), మెక్సికో, ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటస్టిక్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రతినిధులు జాతీయ మౌలిక సదుపాయాల వ్యయాన్ని మెరుగుపరచడంపై కేస్‌ స్టడీస్‌ పత్రాలు వర్క్‌షాప్‌లో సమర్పించారని తెలిపారు. జి20 దేశాలకు చెందిన కొంతమంది ప్రతినిధులతో నగరాలు, పట్టణాల్లో కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాప్‌ గురువారం జరగనుందని ఆరోక్యరాజ్‌ చెప్పారు.