70 ఏళ్ల తర్వాత భారత్ లో చీతాల జననం

ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా నమీబియా నుంచి గతేడాది భారత్‌ కు తీసుకొచ్చిన ఓ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌ లోని కూనో నేషనల్‌ పార్క్‌ లో నమీబియా చిరుతకు నాలుగు పిల్లలు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ధృవీకరించారు. చిరుత పిల్లల చిత్రాలను, వీడియోను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.

 ‘అభినందనలు.. అమృత్ కాల్ సమయంలో మన వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన! 2022 సెప్టెంబరు 17న ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశానికి తీసుకొచ్చిన చిరుతల్లో ఒకదానికి నాలుగు పిల్లలు పుట్టాయని, ఈ విషయాన్ని పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను’ అని ట్విట్టర్ లో కేంద్ర మంత్రి తెలిపారు.

భారతదేశంలో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది. ఇందులో భాగంగా గతేడాది సెప్టెంబర్‌ 17వ తేదీన నమీబియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వదిలారు.

దానితో అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుతపులుల్లో ఒక రకం) దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టాయి. ఆ ఎనిమిదింట్లో ఆడ చీత సాషా సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో సాషా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సాషా మృతి చెందిన రెండు రోజుల్లోనే మరో చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ పరిణామంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌ గడ్డపై చీతాలు జన్మించాయి.

మనదేశంలోని చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. ఈ క్రమంలో దేశంలో చిరుతలు పూర్తిగా అంతరించి పోయినట్లు భారత ప్రభుత్వం 1952లో అధికారికంగా ప్రకటించింది. అంతరించి పోయిన చిరుతల సంతతిని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ చీతాను ప్రారంభించింది.