ప్రభుత్వ భూముల్లో విల్లాలు.. కేటీఆర్ వందల కోట్ల కుంభకోణం

హైదరాబాద్ నగరం నడిబొడ్డున హఫీజ్ పేట సర్వే నెంబర్ 77, 78, 79, 80 భూములలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్న విలాసవంతమైన విల్లాల వెనక వందల  కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. ప్రభుత్వ భూముల అని హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ ఎలా అనుమతులు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.

దీని వెనక మంత్రి కేటీఆర్ ఉన్నారని పేర్కొంటూ మున్సిపల్, పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రిగా బాధ్యత వహించాలని బిజెపి నేత స్పష్టం చేశారు. ఎనిమిది ఎకరాల్లో అపార్ట్ మెంట్స్ నిర్మాణం శరవేగంగా సాగుతుందని చెబుతూ దీనివల్లనే ఏపీ బీఆర్ఎస్ శాఖ నేతకు లబ్ధి చేకూర్చుతున్నారని ఆయన ఆరోపించారు.

రూ. 500 కోట్ను ఓ సంస్థకు లాభం చేకూర్చే విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని రఘునందనరావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పరిధిలోని శాఖ కింద వచ్చే ఈ వ్యవహారంపై ఆయన ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు.  సర్వే నెంబర్ 77 హఫీజ్ పేట 2013, జూలై 15న ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పు తప్పని  ఇద్దరు జడ్జీల బెంచ్ సస్పెండ్ చేసినట్లు ఆయన ఆధారాలను చూపించారు.

అది ప్రభుత్వ భూమే అని స్పష్టం చేస్తూ అలాంటి భూములను ప్రభుత్వం ఎలా రిజిస్ట్రేషన్ చేస్తుందని విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి నాది అని ఓ వ్యక్తి అప్లికేషన్ పెట్టుకుంటే, ఐదు రోజుల్లోనే ఫైల్ మూవ్ అయ్యిందని బిజెపి ఎమ్యెల్యే వెల్లడించారు. కోర్టు సస్పెండ్ చేసిన డిక్రీలోని ఎనిమిది ఎకరాల్లో అపార్ట్ మెంట్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ ఎలా అనుమతి ఇస్తుందని ఆయన ధ్వజమెత్తారు.

ఇప్పటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ అపార్ట్‌మెంట్‌కు అనుమతి ఇచ్చేయండని చెబుతూ ఎవరు బ్రోకరిజం చేసారని ఆయన కేటీఆర్ ను ప్రశ్నించారు.  హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారని, మరి ఇక్కడ జరిగిన అవకతవకలపై ఏం మాట్లాడుతారని అడిగారు. ఈ భూ కుంభకోణంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని రఘునందనరావు హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ శాఖ పరిధిలో జరిగిన కుంభకోణంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.