తెలంగాణాలో మూడు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండగా, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మూడు జిల్లాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది.
 
గతంతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలలో మాత్రం కరోనా వ్యాప్తి బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో గత రెండు వారాలు నుండి ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు.
 
 ఇంతకుముందు 0.5% గా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు తెలంగాణ రాష్ట్రంలో రెండు శాతం వరకు నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మూడు జిల్లాలలోనూ ప్రతి వంద మందిలో నలుగురైదుగురికి కరోనా పాజిటివ్ వస్తుందని, దీంతో ఆయా జిల్లాల ఆఫీసర్లు కరోనా కట్టడికి దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తుంది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫ్లూఎంజా కేసులు వణికిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కరోనా కేసులు కూడా నమోదు అవుతుండడం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. ఈనెల మొదటి, రెండు వారాలలో కరోనా కేసులు బాగా పెరిగాయని, ఇప్పుడు మళ్లీ తగ్గుతున్నాయని తెలుపుతున్న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కరోనా మహమ్మారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది.

కానీ కరోనా జాగ్రత్తలు పాటిస్తే వ్యాప్తిని నివారించవచ్చని సూచిస్తుంది. ప్రభుత్వ సూచన మేరకు టెస్టుల సంఖ్య పెంచామని, కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా నియంత్రణకు సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖాధికారులు కేంద్రానికి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని వివరించి, కేంద్రం నుండి సూచనలు తీసుకున్నారు. టెస్టింగ్, ట్రేసింగ్ పెంచి కరోనా కట్టడికి రంగంలోకి దిగారు.