న్యాయస్థానాల పరిధిలో హైకోర్టు తరలింపు అంశం

 

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును కర్నూల్‌ కు తరలిచాంలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం  ప్రకారం రాష్ట్ర హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని పేర్కొన్నారు.

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు  ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటయిందని తెలిపారు.  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయని కిరణ్ రిజిజు చెప్పారు.

మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు రాజధాని అమరావతి నగరంలో, పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించిందని తెలిపారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.