ఎబివిపి మాజీ జాతీయ కార్యదర్శి కడియం రాజు మృతి

ఎబివిపి మాజీ జాతీయ కార్యదర్శి కడియం రాజు మృతి
సోమశేఖర్ వాసుపల్లి
స్నేహశీలి, నిరాడంబరుడు, వినయశీలి, సహృదయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడు, దేశభక్తుడు డా.కడియం రాజు లేరనే వార్తను జీర్ణించుకోలేక పోతున్న, వారి మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరనిలోటు. వారి ఆత్మకు సద్ఘతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము.
 
ఎబివిపి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం- అన్న, బాబాయ్, మామగా ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీ యువ సంచలనం – అతనే డా.కడియం రాజు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామం నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు.
 
తన పాఠశాల విద్య కొండ్రాపోల్ గ్రామంలో, ఇంటర్మీడియట్ నాగార్జున జూనియర్ కళాశాల, కెఎన్ఎం డిగ్రీ కళాశాల మిర్యాలగూడలో తన బిఎ డిగ్రీ పూర్తి చేశారు.  ఇంటర్మీడియట్ నుండి దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఎబివిపిలో క్రియాశీలకంగా పనిచేస్తూ కె ఎన్ ఎం డిగ్రీ కళాశాల ఎబివిపి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.

పేదరికం వెక్కిరిస్తున్నా జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా 2002 సంవత్సరంలో ఉన్నత విద్యకై ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కళాశాల, ఎంఎ చరిత్ర విభాగంలో అడ్మిషన్ పొందారు. బీఈడీ, చరిత్ర విభాగం లొనే ఎంఫిల్, పిహెచ్ డి పూర్తి చేశారు.2002 సంవత్సరం నుండి ఎబివిపి ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రేయాశీలకంగా పనిచేశారు. ఎబివిపి చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్లు, 108 రోజులు జైలు పాలయ్యారు.
                
ఎబివిపిలో తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్ , నగర కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, జాతీయ కార్యదర్శి, జాతీయ కార్యవర్గ   సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖలోని జాతీయ ఎస్సి, ఎస్టీ, దివ్యాంగుల విద్య నియంత్రణ కమిటీ సభ్యులుగా భాద్యతలు నిర్వర్తించారు.
            
ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో ఎబివిపి చేపట్టిన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఎబివిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో “తెలంగాణ రణ భేరి” లో సుష్మా స్వరాజ్ “ఆత్మహత్యలు వద్దు- బ్రతికుండి తెలంగాణ సాధిద్దాం” అని గర్జించిన రణభేరికి కడియం రాజు
 
అదేవిధంగా ఎబివిపి తెలంగాణ సాధనకై మహాపాద యాత్రలో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకలజనుల సమ్మె, సాగర హారం, ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్థుల నిరాహార దీక్షలు ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు.
                 
ఎబివిపి చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమం లో డా.కడియం రాజు ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టులలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్స్ బిల్లులు, స్కాలర్షిప్పులు, మౌళిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణంకై అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. జాతీయ భావాలు కలిగిన దేశభక్తులుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మన డా.కడియం రాజు గారి మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరనిలోటు.