కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈడీ ‘కేవియట్’ దాఖలు

దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 24న సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఉండటంతో అప్రమత్తమైన ఈడీ కవిత వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది.
 
కేవియట్ పిటిషన్ దాఖలుతో సుప్రీం ఇరుపక్షాల వాదనలు విననుంది. ఈడీతో పాటు కవిత తరపు న్యాయవాది వాదనలు కూడా ధర్మాసనం విననుంది.  దీంతో ఈ నెల 24న సుప్రీంలో జరిగే విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 11న  కవితను ఈడీ విచారించగా, మరోసారి 18న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
 
మరోవైపు 20న విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి సమన్లు అందించింది. అయితే ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణ జరిగేంత వరకూ ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. అయితే సుప్రీం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు తాను ఎలాంటి విచారణకు హాజరు కాబోమని కవిత స్పష్టం చేశారు.
 
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అనుమానితురాలిగా ఉందని ఈడీ వాదిస్తోంది. ఇందుకు తోడు రుణ్ పిళ్లై గతంలో తాను కవిత ప్రతినిధినని ఇచ్చిన వాంగ్మూలంతో ఈడీ అనుమానానికి బలం చేకూరింది. కానీ కవిత విచారణకు ముందు రోజే తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు కోర్టును ఆశ్రయించారు.
 
అయినప్పటికీ కవితను ఈడీ సుమారు 9 గంటల పాటు ప్రశ్నించింది. రాత్రి 8 గంటల వరకు విచారణ కొనసాగించటంతో కవిత తన హక్కులు, ఈడీ దర్యాప్తు తీరును ఎండగడుతూ సుప్రీంను ఆశ్రయించింది. కాగా, సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
 
అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబులను ముఖాముఖి కూర్చోబెట్టి ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధ్రువీకరింపచేయాలని, అనంతరం అరుణ్‌ పిళ్లైని కవితతో ముఖాముఖి కూర్చోబెట్టి వాస్తవాలను అంగీకరింపచేయాలని ఈడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది.  ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.