మరో కీలక దశను పూర్తిచేసుకున్న చంద్రయాన్3

భారత అంతరిక్ష పరిశోధన సంస్ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ఈ ప్రాజెక్ట్ కీలక దశను పూర్తి చేసుకుంది.
 
అంతరిక్ష ప్రయోగ సమయంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన ప్రకంపనలను ఈ రాకెట్ తట్టుకుంటుందా? లేదా? అనే పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది రెండో టెస్ట్. ఇదివరకు చంద్రయాన్ 3 రాకెట్ ఇంజిన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. 25 సెకెండ్ల ఇంజిన్ ను మండించారు.
 
 ల్యాండర్ ను చంద్రుడిపైకి మోసుకెళ్లడానికి అవసరమైన లాంచింగ్ వెహికల్ క్రయోజనిక్ ఇంజిన్ సీ-20 అది. తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ లో ఈ నెల 24వ తేదీన ఈ టెస్ట్ ఫైర్ చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఇంటిగ్రేటెడ్ మాడ్యుల్ డైనమిక్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది.
 
దీనితో రెండు దశల్లో చంద్రయాన్ మిషన్ 3 ప్రయోగాలను విజయవంతంగా ముగించినట్టయింది. ఇక మూడో దశలో- చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన ల్యాండర్ ను టెస్ట్ చేయాల్సి ఉంది. దీనికోసం ఎలక్ట్రో మేగ్నటిక్ ఇంటర్‌ఫెరెన్స్/ఎలక్ట్రో మేగ్నటిక్ కాంపటిబిలిటీ టెస్ట్ కోసం బెంగళూరు పీణ్యాలోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ కు పంపించారు.
 
రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్, ఆటో కాంపాబిలిటీ టెస్ట్, యాంటెన్న పోలరైజేషన్, ల్యాండర్, దానికి అమర్చిన రోవర్ ను పరీక్షిస్తోన్నారు. ఈ ఏడాది జులై/ఆగస్టు మధ్యకాలంలో తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 మిషన్ ను చంద్రుడిపైకి ఇస్త్రో శాస్త్రవేత్తలు పంపిస్తారు.
ఇస్రో తురుఫుముక్క లాంచ్ వెహికల్ మార్క్ 3.. చంద్రయాన్ 3 ల్యాండర్ ను నింగిలోకి మోసుకెళ్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తున గల కక్ష్యలోకి దీన్ని లాంచ్ చేస్తుంది. అనంతరం ఈ ల్యాండర్ ను శాస్త్రవేత్తలు చంద్రుడిపై ల్యాండ్ చేస్తారు.