బాసర ఆలయంలో ఆన్‌లైన్ సేవలు

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఇ హుండీ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు వారి సౌకర్యార్థం ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌లో పూజలు వసతి బుకింగ్, ప్రసాదం పంపిణీ, తదితర సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆన్‌లైన్ సేవల వల్ల అమ్మవారి సేవలను పారదర్శకంగా సులభంగా పొందగలుగుతారని చెప్పారు. భక్తులు సేవలు ఆప్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 1 నుంచి బాసరలో ఆన్‌లైన్ సేవలు భక్తులకు అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అదే విధంగా ఇ హుండీ సేవలను కూడా భక్తులకు అందుబాటులోకి తెచ్చామని, డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగినందు వల్ల భక్తుల సౌకర్యార్థం ఈ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నామని తెలిపారు.

పేటీఎం, ఫోన్ పె. జీపీ లాంటి యూపీఐల హుండీ కానుకలను చెల్లించవచ్చని పేర్కొన్నారు. అనంతరం దివిస్ లాబొరేటరీస్ సంస్థ ఏర్పాటు చేసిన శుద్ద జల ప్లాంట్‌లను కూడా మంత్రి ప్రారంభించారు.