టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై గవర్నర్ తమిళిసై ఆగ్రహం

* సిట్ చేతికి పేపర్ లీక్ కేసు

తెలంగాణ స్టేట్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన, నిర్వహించాల్సిన రిక్రూట్‌మెంట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా పరిగణించారు. పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించి, లీకేజీపై వివరణాత్మక నివేదికను ఇవ్వాలని ఆదేశిస్తూ టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి ఆమె లేఖ రాశారు.

అసలైన అభ్యర్థుల భవిష్యత్త్, ప్రయోజనాలను కాపాడటానికి ఇటువంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులందరిపై పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ ఘటనపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని  టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు.  ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దానితో ఈ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల పరీక్ష పేపర్లు లీకైనట్టు వెల్లడైంది. అటు, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రాన్ని కూడా ప్రవీణ్ బృందం లీక్ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో దర్యాప్తు బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం సీసీఎస్ పోలీసులకు అప్పగించింది.

 అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్టు ఈ నెల 13న ఫిర్యాదు నమోదైందని, సెక్షన్ 409, 420, 120(బి)తో పాటు ఐటీ చట్టంలోని 66సి, 66బి, 70 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు వెల్లడించింది. ఈ కేసులో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు 8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, మరో నిందితురాలు రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.

ఇలా ఉండగా, అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దుపై   మార్చి 15న  నిర్ణయం తీసుకుంటామని టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధర్ రెడ్డి ప్రకటించారు. పూర్తి నివేదిక వచ్చాక పరీక్ష రద్దు చేయాలా వద్దా అనేది  చెప్తామని తెలిపారు. పరీక్షా పేపర్ లీక్ పై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని  సూచించారు. టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. టీఎస్ పీఎస్సీలో  రాజశేఖర్ రెడ్డి ఆరేళ్లుగా నెట్ వర్క్ ఎక్స్ పర్ట్ గా పనిచేస్తున్నాడని, అతనికి ఐపీ అడ్రస్ లు అన్నీ తెలుసని పేర్కొన్నారు.

రాజశేఖర్ రెడ్డి,  ప్రవీణ్ ఇద్దరు కలిసే పేపర్ లీక్ చేశారని వెల్లడించారు. లీక్ అయిన పేపర్ ను ప్రవీణ్ రూ.10 లక్షలకు అమ్మిండని చెప్పారు. పేపర్ తీసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ రాశారని చెప్పారు.  ఇక ఈ పేపర్ లీక్ ఘటనఫై విద్యార్థి, యువజన సంఘాలు తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తి చేస్తూ, ఆందోళనకు దిగుతున్నాయి. సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకై డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంఫై నిప్పులు చెరుగుతున్నారు.

కాగా, టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్షలన్నీ లీక్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.గ్రూప్-1 ప్రశ్నాపత్రం కూడా లీకైందని స్పష్టం చేశారు.  రాబోయే రెండు మూడు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించి కేసీఆర్ టీమ్ కు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వలేక దారుణాలకు ఒడిగడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.