కేసీఆర్ రాజీనామా చేయాలంటూ ఎబివిపి ఆందోళన

 
‘ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి. ప్రశ్నాపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి.’ అంటూ ఏబీవీపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ  టీఎస్‌పీఎస్సీ ముట్టడికి ప్రయత్నం చేశారు.
 
టీఎస్‌పీఎస్సీ  లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. ఇందులో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. దానితో టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
 
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. పేపర్ లీకేజీ ఘటనకు బాద్యత వహిస్తూ, సీఎం కేసీఆర్,  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.
పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.   టీఎస్‌పీఎస్సీని మొత్తం ప్రక్షాళన చేయాలని కోరారు. మొత్తం ఎన్ని పరీక్షల  పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలను మొత్తం రద్దు చేసి మళ్లీ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
 
మరోవంక, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన నెలకొంది. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పేపర్ లీక్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరారు.
 
ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను తొలగించాలని విద్యార్థులుడిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని, మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయో ఆయా పరీక్షలను రద్దు చేసి మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని కోరారు.
 
 ప్రశ్నా పత్రాలు లీక్ చేసి అమ్ముకుంటున్న వారిని  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పీఎస్ కు తరలించారు.