నోట్ల రద్దుపై చర్చకు బిఆర్ఎస్ కు బిజెపి సవాల్!

“నోట్ల రద్దుపై బిఆర్‌ఎస్ నేతలతో చర్చకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా?” అంటూ బిఆర్ఎస్ నేతలకు  అని మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ మంత్రులు పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని మోదీని క్షమాపణలు కోరడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుకు మొదట మద్దతు తెలిపిన వ్యక్తి సిఎం కెసిఆర్ అని గుర్తు చేస్తూ ముందు ఆయనను క్షమాపణ చెప్పాలని ఆయన సూచించారు.

నోట్ల రద్దు విషయంలో గోబెల్స్ మించిన అబద్దాలను హరీష్ రావు ప్రచారం చేశారని పేర్కొంటూ లార్జెస్ట్ ఎకానమీలో 11వ స్థానంలో భారత్ ఉండేదని చెప్పారు. మోదీ  వచ్చాక ఐదో స్థానానికి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 2027 నాటికి 3వ స్థానంలోకి వస్తామని చెబుతూ బ్లాక్ మనీ, హవాలా మనీ తగ్గడానికి నోట్ల రద్దు నిర్ణయమే కారణం స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంతో తీవ్రవాదం తగ్గిపోయిందని కూడా తెలిపారు. పాకిస్థాన్‌లో గతంలో భారత కరెన్సీని ముద్రించి దొంగ నోట్లు చెలామణి చేయడం ద్వారా భారీగా నిధులు సమకూర్చుకుందని, కానీ మోదీ  నిర్ణయం కారణంగా భారీ దెబ్బ తగిలిందని ఆయన గుర్తు చేశారు.  కాగా, తెలంగాణలో ఢిల్లీలోకన్నా భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని నర్సయ్యగౌడ్ ఆరోపించారు. త్వరలోనే ఈ కుంభకోణాన్ని అన్ని ఆధారాలతో బయటపెడుతామని వెల్లడించారు.

బిజెపి తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్ పర్యటనలో సంకుచితంగా మాట్లాడారని, దేశం ప్రతిష్ట దిగజార్చేలా వ్యాఖ్యానించారని మండిపడ్డారు.రాహుల్‌కు సోయి ఉండే ఆ వ్యాఖ్యలు చేశాడా? అని ఆయన ప్రశ్నించారు.

దేశ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పకుండా సిగ్గు లజ్జ వదిలేసి మోదీపై కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజూ దిగజారిపోతోందని పొంగులేటి విరుచుకుపడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త లీకేజీ సర్వీస్ కమిషన్‌గా మారిందని ఎద్దేవా చేశారు. లీకేజీ ఘటనలో యువమోర్చా నేతల అరెస్ట్ సిగ్గుచేటు అన్నారు.