అమెరికాలో సిగేచర్‌ బ్యాంక్‌ దివాలా

అమెరికాలో మూడు రోజుల్లోనే రెండు బ్యాంక్‌లు మూత పడ్డాయి. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌విబి) సంక్షోభం ముగిసి పోకముందే సిగేచర్‌ బ్యాంక్‌ దివాలా తీసింది. ఎస్‌వీబీ సంక్షోభం నేపథ్యంలో న్యూయార్క్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిగ్నేచర్‌ బ్యాంక్‌ నుంచి డబ్బు విత్‌డ్రా చేసేందుకు డిపాజిటర్లు మూకుమ్మడిగా పరుగులు తీయడంతో ఈ బ్యాంక్‌ను న్యూయార్క్‌ స్టేట్‌ రెగ్యులేటర్లు ఆదివారం మూసివేశారు.
 
న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తోన్న సిగేచర్‌ బ్యాంక్‌ ఎక్కువగా కృత్రిమ విలువ కలిగిన క్రిప్టో డిపాజిట్లను కలిగి ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2022 డిసెంబర్‌ ముగింపు నాటికి 110.36 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9 లక్షల కోట్ల పైగా) ఆస్తులతో పాటు 88.59 బిలియన్‌ డాలర్ల (రూ.7.30 లక్షల కోట్లు) డిపాజిట్లను కలిగి ఉంది.
 
బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో కరెన్సీ నుంచి వచ్చినవి కావడం గమనార్హం. డిపాజిట్‌దారులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవడానికి వీలుగా తాత్కాలికంగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేశామని ఎఫ్‌డిఐసి తెలిపింది. ఈ బ్యాంక్‌ స్థిరాస్తి, క్రిప్టో ఆస్తులతో పాటు తొమ్మిది విభాగాల్లో ఖాతాదారులకు సేవలందిస్తుంది.
సిలికాన్‌ వ్యాలీ తరహాలోనే సిగ్నేచర్‌లో కూడా బిజినెస్‌ ఖాతాదారులు ఎక్కువ. అధిక శాతం ఖాతాల్లో 2,50,000 లక్షల డాలర్లకు మించి నిల్వ ఉంటుంది. కేవలం 2.50 లక్షల డాలర్ల విలువ గల డిపాజిట్లకు మాత్రమే ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ బీమా రక్షణ ఉంటుంది.
 
కాగా.. ఎస్‌విబి, సిగేచర్‌ బ్యాంక్‌ల పతనానికి కారకులైన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ స్పష్టం చేశారు. అలాగే డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చారు. మరోవైపు ఎస్‌విబి బ్రిటన్‌ కార్యకలాపాలను దివాలా ప్రక్రియ కింద కేవలం ఒక్క పౌండ్‌ (రూ.99)కే హెచ్‌ఎస్‌బిసికి అప్పగిస్తూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నిర్ణయం తీసుకోవడం విశేషం.
సిలికాన్‌ వ్యాలీ టెక్నాలజీ స్టార్టప్‌లకు నిధులు అందించడంలో ప్రత్యేకత కలిగిన బ్యాంక్‌ కాగా, సిగ్నేచర్‌ బ్యాంక్‌ క్రిప్టోకరెన్సీ ఆస్తుల్ని , క్రిప్టో ఎక్సేంజీల నగదు నిల్వల్ని డిపాజిట్లుగా స్వీకరించే అతికొద్ది అమెరికా బ్యాంక్‌ల్లో ఒకటి. డిజిటల్‌ సంబంధిత క్లయింట్‌ డిపాజిట్లు ఈ బ్యాంక్‌లో 16.52 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి. క్రిప్టో ఎక్సేంజ్‌ కాయిన్‌బేస్‌ గ్లోబల్‌కు చెందిన 240 మిలియన్‌ డాలర్ల నగదు బ్యాలెన్స్‌ సిగ్నేచర్‌ బ్యాంక్‌ ఉన్నట్టు తాజా ట్వీట్‌లో తెలిపింది.