పుల్వామా ఉగ్రదాడిపై మరో కాంగ్రెస్ నేత అనుమానం!

మనదేశంపై పాకిస్థాన్ సాగిస్తున్న కుతంత్రాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత మన వీరసైనికులు పాకిస్తాన్ ఆధీనంలోని భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలపై సాగించిన మెరుపు దాడులు గురించి రాహుల్ గాంధీ నుండి కాంగ్రెస్ నాయకులందరూ తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తూ మన జాతీయ ప్రతిష్టను మంటగడుపుతున్నారు. మన సైనికుల పరాక్రమాలను అవమానిస్తున్నారు.
 
తాజాగా మరో కాంగ్రెస్ నేత ఆ కోవలోకి చేరారు. “పుల్వామా ఎలా జరిగింది? విచారణ జరిపించండి. ఎన్నికల కోసం ఆయన ఇది చేశారా?” అని రాజస్థాన్ కాంగ్రెస్  ఇన్‍చార్జ్ సుఖ్‍జిందర్ సింగ్ రంఢావా ప్రశ్నించారు. అంతేకాదు, ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
“మా కంటే ఎక్కువ దేశభక్తులు లేరని వాళ్లు (బీజేపీ) చెబుతారు, దేశభక్తి అంటే మోదీకి అర్థం కూడా తెలియదు. భారత దేశ స్వాతంత్య్రం కోసం ఏ బీజేపీ నాయకుడు పోరాడారు?” అని పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు.
 
అదానీ గ్రూప్‍పై హిండెన్‍బర్గ్ వెల్లడించిన రిపోర్టుపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ సోమవారం ధర్నా నిర్వహించింది. ఆ కార్యక్రమంలో సుఖ్‍జిందర్ మాట్లాడుతూ “మనలో మనం గొడవ పడడం ముగిద్దాం. మోదీ ముగింపు గురించి ఆలోచిద్దాం. మనం మోదీని ఫినిష్ చేస్తేనే.. హిందుస్థాన్ మనుగడ ఉంటుంది. ఒకవేళ ఉంటే.. హిందుస్థాన్ ఫినిష్ అవుతుంది” అంటూ అనుచితంగా మాట్లాడారు.
 
పుల్వామా దాడి, ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుఖ్‍జిందర్ సింగ్‍పై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సైనికుల త్యాగాలను, మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఏవిధంగా అవమానిస్తుందో ఈ మాటలే నిదర్శనమని రాజస్థాన్ బిజెపి అధ్యక్షుడు సతీష్ పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్ నేతలు మన భద్రతా వ్యవస్థను, నిఘా వ్యవస్థను, సైనికులను పదే  పదే అవమానిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ రాథోర్ విమర్శించారు. అమర జవాన్లను, ప్రధానమంత్రి స్థానాన్ని రంఢావా అవమానించారని విమర్శించారు. దేశ ప్రతిష్టను భంగం కలిగేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక సుఖ్‍జిందర్ క్షమాపణ చెప్పాలని మరికొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.