దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో ఇన్‌ప్లూయెంజా  రకం వైరస్ కేసులు నమోదు ఒకవంక ఆందోళన కలిగిస్తుండగా, ఇదే సమయంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతూ ఉంది. దేశంలో 114 రోజుల తర్వాత శనివారం మొదటిసారి రోజువారీ కేసులు 500 దాటాయి. శనివారం దేశవ్యాప్తంగా 524 కేసులు నమోదు కాగా.. , చివరి సారిగా గతేడాది నవంబరు 18 ఈ సంఖ్యలో నమోదయ్యింది.
 
అలాగే, గత 11 రోజుల్లో వారం సగటు కేసులు రెట్టింపయ్యాయి. మొత్తంగా చూసుకుంటే రోజువారీ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. మరణాలు కూడా స్వల్పంగానే ఉన్నాయి. గత వారం రోజుల్లో కరోనాతో ఆరుగురు చనిపోయారు.  గత వారం దేశవ్యాప్తంగా 2,671 కొత్త కేసులు నమోదు కాగా, అంతకు ముందు వారం నమోదైన 1803 కేసులతో పోల్చితే 50 శాతం అధికం.
 
గతేడాది జూన్-జులై తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుదల గత నాలుగు వారాల నుంచి స్థిరంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల్లోనే కొత్త కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. గత వారం రోజుల్లో కర్ణాటక (584), కేరళ (530), మహారాష్ట్ర (512)లో 500కి పైగా కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో 100కి పైగా కేసులు నమోదయ్యాయి.
 
గుజరాత్‌లో ఇన్‌ఫెక్షన్ అత్యధికంగా నమోదయ్యింది. ఫిబ్రవరి 26-మార్చి 4తో ముగిసిన ముందువారం 48 కేసులు నమోదుకాగా, గతవారం (మార్చి 5-11) ఏకంగా 190 మంది వైరస్ బారినపడ్డారు. ఈ సమయంలో మహారాష్ట్ర 87 శాతం, తమిళనాడు 67 శాతం (224), తెలంగాణ 63 శాతం (197) పెరుగుదల కనిపించింది.  మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ ఉన్నా, వారం వారీగా చూస్తే 100లోపు ఉన్నాయి.
దేశంలో గత 11 రోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. ఫిబ్రవరి 28న 193గా ఉన్న కేసులు, మార్చి 11 నాటికి 383కి చేరాయి. మార్చి నెల ప్రారంభంలో డబ్లింగ్ రేటు 16 శాతానికి దగ్గరగా ఉండటం ఇటీవల రోజుల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయనడానికి సంకేతం. వారం వారీ కరోనా మరణాలు 10లోపు ఉన్నాయి. గత రెండు వారాలుగా సగటున ఆరుగురు చొప్పున కరోనాతో చనిపోయారు.

కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజా లాంటి అనారోగ్యం లేదా తీవ్రమైన ధీర్ఘకాలిక శ్వాససంబంధిత ఇన్‌ఫెక్షన్‌ కేసులుగా కనిపించే శ్వాసకోశ వ్యాధికారక సమగ్ర నిఘా కోసం కార్యాచరణ మార్గదర్శకాలను అనుసరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో తెలిపారు. మందులు, వైద్య ఆక్సిజన్‌ లభ్యత, కరోనా, ఎన్‌ఫ్లుయెంజాకు వ్యతిరేకంగా టీకా కవరేజ్‌ వంటి ఆస్పత్రి సంసిద్ధత స్టాక్‌ను తీసుకోవాలని భూషణ్‌ అభ్యర్థించారు.