సానియా మీర్జాను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ లేఖ

ఇటీవలనే టెన్నిస్ నుండి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించి, చిట్టచివరి ఆట కూడా ఆడిన హైదరాబాద్ కు చెందిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను అభినందిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమెకు రెండు పేజీల లేఖను వ్రాసారు. ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చాయని ఆ లేఖలో ప్రధాని ప్రశంసించారు.
 
లైఫ్ అప్ డేట్ అంటూ జనవరి 13వ తేదీన ఓ లెటర్ ను ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తన కెరీర్ లోని ముఖ్య ఘట్టాలన్నింటినీ అందులో పొందుపర్చారు. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు అందులో ప్రకటించారు.  ఈ సందర్భంగా సానియా మీర్జాను అభినందిస్తూ ఈ నెల 9వ తేదీన ప్రధాని మోదీ ఆమెకు రెండు పేజీల లేఖ రాస్తూ లైఫ్ అప్ డేట్ అంటూ జనవరి 13వ తేదీన పెట్టిన పోస్ట్ తనను కదిలించిందని పేర్కొన్నారు.
 
కిందటి నెలలో ఆమె చివరి టోర్నీ ఆడి ఓటమితో ముగించారు. దుబాయ్ ఓపెన్ డబ్ల్యూటీఏలో డబుల్స్ లో అమెరికాకి చెందిన మాడిసన్ కీస్‌ తో కలిసి ఆడిన ఈ మ్యాచ్‌ లో కూడా సానియా మీర్జా పరాజయాన్ని చవి చూశారు. ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ రౌండ్‌ని కూడా దాటలేకపోయారు.
 
రష్యాకు చెందిన వెర్నోకియా-సంసొనోవా చేతిలో 4-6, 0-6 తేడా ఓడిపోయారు. 36 సంవత్సరాల వయసులో ఆమె కేరీర్ కు వీడ్కోలు చెప్పారు. కాగా, విమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లల్లో గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చాయని ప్రధాని కితాబిచ్చారు. ఆరు సంవత్సరాల వయస్సు నుంచే టెన్నిస్ పట్ల ఆసక్తి చూపడం అసాధారణమని ఆయన పేర్కొన్నారు.
 
 ప్రధాని లేఖను సానియా మీర్జా శనివారం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. తనను అభినందిస్తూ లేఖ రాసిన ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మోదీ తనకు లేఖ రాయడాన్ని చిరస్మరణీయంగా భావిస్తానని సంతోషం వ్యక్తం చేశారు.  మన దేశానికి ప్రాతినిధ్యాన్ని వహించడం తనకు ఎప్పుడూ గర్వకారణమేనని ఆమె తెలిపారు. దేశం గర్వించేలా క్రీడారంగం అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.