మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఏపీ సీఐడీ కేసు

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని పేర్కొంటూ చిట్‌ ఫండ్స్‌ చైర్మన్‌, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శైలజలపై సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

420(చీటింగ్‌) సహా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. అదేవిధంగా వివిధ జిల్లాల్లోని మార్గదర్శి కార్యాలయాల మేనేజర్లను ఈ కేసులో పేర్కొన్నారు. ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజ, ఏ3గా బి. శ్రీనివాసరావు ఇతరులను చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తెల్లవారుతూనే సీఐడీ అధికారులు మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.

ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. అనంతరం, రామోజీరావుతోపాటు శైలజపై సెక్షన్‌ 120బీ, 409, 420, 477(ఏ), రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, 76 సీఎ్‌ఫఏల కింద మేనేజర్లనూ నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడలోని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ వీఎ్‌సఎస్‌ కృష్ణారావు ఈ నెల 10న ఇచ్చిన రాత పూర్వక ఫిర్యాదు మేరకు ఏపీ ప్రొటెక్షన్‌, ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఇన్‌ ఫైనాన్షియర్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌(ఏపీపీడీఎ్‌ఫఈఏ) 5 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, ఏలూరు, కర్నూలు, నరసరావుపేట, అనంతపురంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని లబ్బీపేట కార్యాలయానికి మేనేజర్‌ను ఇంటి నుంచి తీసుకొచ్చిన అధికారులు బలవంతంగా కార్యాలయ తలుపులు తెరిపించారని సిబ్బంది పేర్కొన్నారు.

తమతోపాటు తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో కలిసి పలు రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలించారు. మేనేజర్‌ను విచారించారు. గుంటూరు కార్యాలయంలోనూ ఇలానే తనిఖీలు చేశారు. ఇక్కడి మేనేజర్‌ను ప్రశ్నించి సమాధానాలు రికార్డు చేశారు.

విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న మార్గదర్శి బ్రాంచ్‌ కార్యాలయ మేనేజర్‌ శ్రీనివాస్‌ పటమటలంకలో నివాసం ఉంటున్నారు. సీఐడీ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు బృందాలుగా శ్రీనివాస్‌ నివాసానికి వెళ్లారు. ఆయనను అక్కడి నుంచి కారులో ఎంజీ రోడ్డులో ఉన్న బ్రాంచ్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. కార్యాలయ తలుపు మూసి ఆయనను విచారించారు.

నెల క్రితం కూడా మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ, జీఎస్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. విశాఖలో విశాఖలోని మార్గదర్శి చిట్‌ఫండ్‌ కార్యాలయంలో సీఐడీ అధికారులు స్థానిక పోలీసుల సాయంతో సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటలకు వరకూ తనిఖీలు చేశారు. ఆదివారం కూడా సోదాలు కొనసాగుతాయని అదనపు ఎస్పీ రవివర్మ తెలిపారు. సోదాలు జరుగుతున్నంత సేపు కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు.