భారతీయ విద్యార్థుల డిగ్రీలు ఆస్ట్రేలియాలో చెల్లుబాటు

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థుల డిగ్రీలకు గుర్తింపు ఇస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ ప్రకటించారు. భారతదేశంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని బుధవారం గుజరాత్‌లోకి అహ్మదాబాద్‌ వచ్చారు. ఆయన భారత్ కు రావడం ఇదే తొలిసారి.  గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌లతో సమావేశం అయ్యారు. అనంతరం ఇరు దేశాల నాయకులు, అధికారుల మధ్య వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా విద్యారంగానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి.
 
 ఇందులో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో భారతీయ డిగ్రీలకు గుర్తింపు ఇవ్వడంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందంతో భారతీయ విద్యార్థులకు మేలు జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఆస్ట్రేలియాలో చదువుతున్న లేదా చదివిన భారతీయ విద్యార్థులు తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు వారి డిగ్రీకి పూర్తిస్థాయిలో గుర్తింపు ఉంటుందని అల్బనీస్‌ స్పష్టం చేశారు.
 
అలాగే భారతీయ విద్యార్థుల డిగ్రీ ఆసీస్‌లో చెల్లుబాటు అవుతుందని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు అల్బసీస్‌ ప్రకటించారు. ఇరుదేశాల్లోని విద్యార్థులకు ప్రయోజనాలు చేకూర్చేలా ‘ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ మెకానిజం’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
 
ఆస్ట్రేలియాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నట్లు అల్బసీస్‌ వెల్లడించారు. నాలుగు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో చదువుకునే భారతీయులకు మైత్రి స్కాలర్‌షిప్స్ ఇస్తామని పేర్కొన్నారు. దీంతో రెండు దేశాల్లో విద్య, ఉపాధి రంగాలు బలోపేతం అవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత్‌, ఆస్ట్రేలియా ఫ్రేమ్‌వర్క్‌ మెకానిజంపై గురువారం సంతకం చేశాయి.

భారతీయ విద్యార్థులకు వినూత్నమైన విద్యను అందించేందుకు ప్రయత్నం చేస్తామని అల్బనీస్‌ భరోసా ఇచ్చారు. దీని ద్వారా వాణిజ్య అవకాశాలకు మార్గం సుగమం చేసినట్లు అవుతుందని అల్బనీస్‌ తెలిపారు. రెండు దేశాల్లోని విద్యాసంస్థలు భాగస్వాములు కావడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇది భారత్‌తో చేసుకున్న సమగ్రమైన, ప్రతిష్టాత్మకమైన మెకానిజంగా ఆయన అభివర్ణించారు.

ఈ ఒప్పందంతో విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని, భవిష్యత్తు తరాలకు అపారమైన అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఉన్నత విద్యా అవకాశాలు పెరగడంతో పాటు యువతలో నైపుణ్యం పెంచేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 కాగా, భారత్ తమ దేశానికి సన్నిహిత మిత్రుడిగా అల్బనీస్‌ అభివర్ణించారు. రెండు దేశాల మధ్య విద్యారంగంతో పాటు రక్షణ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి 11 అంశాల్లో అవగాహన ఒప్పందాలు జరిగినట్లు సమాచారం.