
అంతర్జాతీయ వేదికపై మరోసారి పాకిస్థాన్ భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆ వ్యాఖ్యలు విలువలేనివని, మలినమైన, తప్పుడు ప్రచారం పట్ల స్పందించడం కూడా వ్యర్థమని భారత్ మండిపడింది.
యూఎన్‌లోని భారత అంబాసిడర్ రుచిర కాంబోజ్ ఈ అంశంపై స్పందిస్తూ పాక్ మంత్రి ఇచ్చిన ప్రకటనను తప్పుపట్టారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ ప్రతీకారేచ్ఛతో ఆ వ్యాఖ్యలు చేసినట్లు కాంబోజ్ ఆరోపించారు.
మహిళలు, శాంతి, భద్రత అంశంపై యూఎన్ భద్రతా మండలి సమావేశంలో కాంబోజ్ మాట్లాడుతూ పాక్ చేసిన ఆరోపణలపై స్పందించడం నిరర్ధకమని తమ బృందం భావిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. పాజిటివ్, ఫార్వడ్ అంశాలపై తాము ఫోకస్ పెట్టామని, ఇలాంటి ఎజెండాను బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు.
చర్చ కోసం ఎన్నుకున్న అంశం పట్ల గౌరవం ఉందని, దాని ప్రాముఖ్యత తమకు తెలుసు అని తమ దృష్టి అంతా ఆ అంశంపైనే ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్ తో పాటు లడాఖ్‌లోని అన్ని ప్రాంతాలు భారత భూభాగానికి చెందినవే అని గతంలో పలు మార్లు యూఎన్ వేదికగా భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?