పాక్ లో హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్ధులపై దాడి

పాకిస్తాన్ లోని పంజాబ్ యూనివర్సిటీ లా కళాశాల ప్రాంగణంలో హోలీ ఉత్సవం జరుపుకోవడానికి గుమికూడిన సుమారు 30 మంది హిందూ విద్యార్థులపై రాడికల్ ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ‘ఇస్లామీ జమాయిత్ తుల్బా’ సభ్యులు దాడి చేశారు. అయితే, వారిని రాడికల్ ఇస్లామిక్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు హోలీ పండుగ జరుపుకోకుండా అడ్డుకున్నారు.
 
 హిందూ విద్యార్థులపై వారు దాడికి దిగడంతో 15 మంది వరకు హిందూ విద్యార్థులు గాయపడ్డారు. హోలీ జరుపుకునేందుకు కాలేజీ యాజమాన్యం నుంచి ముందే అనుమతి కూడా తీసుకున్నామని హిందూ విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత, ఈ విషయమై ఫిర్యాదు చేయడానికి వైస్ చాన్సలర్ ఆఫీస్ వెళ్లిన హిందూ విద్యార్థులపై అక్కడి గార్డులు కూడా దాడి చేశారు.
 
వీసీ ఆఫీస్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తమపై అక్కడి గార్డులు చేయి చేసుకున్నారని తలపై గాయంకు గురైన విద్యార్థి ఖేత్ కుమార్ తెలిపారు. ఈ రెండు ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆరోపించారు.
 
ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విద్యార్థులతో హోలీ ఉత్సవం నిర్వహణలో పాల్గొన్న సింధు మండలి ఈ దాడిని ఖండించింది. ఉత్సవంకు యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి ఇచ్చిన్నట్లు స్పష్టం చేస్తూ ఆహ్వానములను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని కూడా ఇంజేటి వేధించినట్లు మండలి ప్రధాన కార్యదర్శి కషిఫ్ బ్రోహి ఆరోపించారు.
 
ఇస్లామాబాద్ లోని క్కుఐడి అజమీ యూనివర్సిటీలో బలూచి విద్యార్ధులపై దాడి జరిగిన కొద్దీ రోజులకు హిందూ విద్యార్ధులపై ఈ దాడి జరగడం గమనార్హం.  అయితే, హోలీ జరుపుకునే విద్యార్థులపై జరిగిన దాడిలో తమ విద్యార్థుల ప్రమేయం లేదని ఇస్లామీ జమాయిత్ తుల్బా పంజాబ్ యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఇబ్రహీం షాహిద్ తెలిపారు.
 
ఆ సమయంలో లా కాలేజీలో ఐజెటి తరఫున ఖురాన్ పఠనం కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.  మరోవంక, యూనివర్సిటీ ప్రాంగణంలో హోలీ జరుపుకునేందుకు విద్యార్థులకు అనుమతి ఇవ్వలేదని పంజాబ్ యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఖుర్రం షాజహాద్ తెలిపారు.