విడాకులు తీసుకున్నా బలవంతంగా భర్తల వద్దకు పంపుతున్న తాలిబన్లు

అఫ్గానిస్థాన్‍లో తాలిబన్ల రాజ్యంలో మహిళల వేదనలకు అంతులేకుండా పోతుంది. ఒక వంక వారిని విద్య, ఉద్యగల నుండి గెంటివేస్తూ, ఇల్లు దాటి బైటకు రావద్దన్నట్లు నిరంకుశంగా వ్యవహరిస్తుండగా, మరోవంక, వేధింపులను భరించలేక గతంలో విడాకులు తీసుకున్న భర్తల వద్దకే తిరిగి వెళ్ళమని బలవంతం చేస్తున్నారు.
 
సంవత్సరాలపాటు భౌతికంగా, మానసికంగా వేధించిన భర్తల నుండి తీసుకున్న విడాకులు ఇప్పుడు తాలిబన్ పాలకులు రద్దు చేస్తున్నారు. తిరిగి వారి వద్దకే పంపుతున్నారు. తనకు బలవంతంగా విడాకులు ఇప్పించారంటూ తాలిబన్లకు తన భర్త చెప్పాడని, దీంతో వారు విడాకులను రద్దు చేశారని అంటూ బాధిత మహిళలు గగ్గోలు పెడుతున్నారు.
 
ఆ విధంగా తన భర్త మళ్లీ తన వద్దకు రావడంతో “దేవుడా.. రాక్షసుడు మళ్లీ తిరిగివచ్చాడని నాలో నేను ఎంతో వేదన పడ్డా. నేను, నా కూతురు ఆరోజు చాలా ఏడ్చాం” అని 40 ఏళ్ల ఒక మహిళా మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకుంది.  మళ్లీ కలిసిన తర్వాత భర్త మరింత వేధింపులకు గురి చేసాడని, తరచూ కొట్టేవాడని, దీంతో తన చేతులు తీవ్రంగా గాయపడ్డాయని, వేళ్లు పగిలిపోయాయని,  పళ్లు సైతం చాలా దెబ్బ తిన్నాయని ఆమె విలపిస్తూ చెప్పింది.
 
“అతడు నా వెంట్రుకలు పట్టుకుని లాగుతాడు. దీంతో నాకు స్వల్పంగా బట్టుతల కూడా వచ్చింది. నన్ను విపరీతంగా కొడుతున్నాడు. దీంతో నా పళ్లన్నీ పగిలిపోయాయి” అని ఆమె చెప్పారు. అయితే తన భర్త నుంచి తాము మళ్లీ తప్పించుకొని పేర్లు మార్చుకొని తిరుగుతున్నామని ఆమె పేర్కొన్నారు. మళ్లీ ఎక్కడ కనిపెడతాడో అని భయంభయంగా జీవిస్తున్నామని చెప్పుకొచ్చింది. 

తాలిబన్ కమాండర్లు అఫ్గానిస్థాన్‍లో చాలా మంది విడాకులను రద్దు చేశారని, గతంలో వేధింపులను ఎదుర్కొన్న మహిళలను మళ్లీ వారి భర్తల వద్దకు బలవంతంగా పంపుతున్నారని ఆ దేశానికి చెందిన కొందరు లాయర్లు ఓ వార్తా సంస్థకు తెలిపారు.

తాలిబన్లు తన విడాకులను బలవంతంగా రద్దు చేశారని మరో యువతీ చెపింది. తన భర్త నుంచి తాను విపరీతమైన వేధింపులకు గురవుతున్నానని వెల్లడించారు. “మా అమ్మాయి ఏడ్చినా.. ఆహారం బాగాలేకున్నా అతడు నన్ను విపరీతంగా కొడతాడు. మహిళలకు అసలు మాట్లాడే అర్హతే లేదని నన్ను దూషిస్తుంటాడు” అని చెప్పారు.

అయితే తన కూతురికి తాలిబన్ కమాండర్‌తో ఎంగేజ్‍మెంట్ నిశ్చయించటంతో తన భర్త నుంచి తప్పించుకొని రహస్యంగా జీవిస్తున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తమ ఇంటి తలుపు ఎప్పుడు చప్పుడైనా విపరీతమైన భయం వేస్తోందని అన్నారు. అలా చాలా మంది మహిళల విడాకులను తాలిబన్లు రద్దు చేశారని తెలుస్తోంది.