భూకక్ష్యలోని ఉపగ్రహం కూల్చివేసిన ఇస్రో

భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న మేఘ-ట్రోపికస్‌-1 (ఎంటీ 1) ఉపగ్రహాన్ని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. దాదాపు పదేళ్ల పాటు సేవలందించిన ఈ ఉపగ్రహం మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 7.30 గంటల మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించింది.
 
అనంతరం దానికదే విడిపోయి పసిఫిక్‌ మహాసముద్రంపైన గగనతలంలో కాలి బూడిదైనట్టు ఇస్రో ట్విట్టర్‌లో వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యర్థాల ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ధ్వంసం చేసే సత్తా అమెరికా, రష్యా, చైనాలతో పాటు భారత్‌కే ఉందని తెలిపారు.
 
భూ వాతావరణ పరిస్థితుల అంచనా కోసం 2011 అక్టోబరు 12న ఫ్రెంచ్‌ స్పేస్‌ ఏజెన్సీ సహకారంతో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. అయితే, 2021 తర్వాత దీని పనితీరు పూర్తిగా నిలిచిపోయింది. చైనా అంతరిక్ష వ్యర్థాలు తరచూ భూవాతావరణంలోకి ప్రవేశించి ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో భారత ఉపగ్రహాల వల్ల అలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించాలని ఇస్రో లక్ష్యం పెట్టుకుంది.
 
గంటకు 27 వేల కి.మీ. వేగంతో కక్ష్యలో తిరుగుతున్న మేఘ-ట్రోపికస్‌ను ధ్వంసం చేయడం ద్వారా గతి తప్పిన, కాలం చెల్లిన ఉపగ్రహాలను కూల్చేసే సత్తా ఇస్రోకు ఉన్నట్లు నిరూపితమయింది.  ఆగస్టు 2022 నుంచి 120 కిలోల ఇంధనాన్ని మండిస్తూ 20 వ్యూహాత్మక శ్రేణి ద్వారా ఉపగ్రహం పెరిజీ క్రమంగా తగ్గించారు.
 
చివరి డి-బూస్ట్ వ్యూహం అనేక విన్యాసాలు, పరిమితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రూపొందించారు. వీటిలో గ్రౌండ్ స్టేషన్‌లపై రీ-ఎంట్రీ ట్రేస్ దృశ్యమానత, లక్ష్యంగా ఉన్న జోన్‌లోని భూమి ప్రభావం, సహ వ్యవస్థలను అనుమతించదగిన ఆపరేటింగ్ పరిస్థితులు, ప్రత్యేకించి గరిష్టంగా థ్రస్టర్లను మండించగల సామర్థ్యం పరిగణనలోకి తీసుకున్నారు.

చివరి రెండు డీ-బూస్ట్ బర్న్‌లు మార్చి 7న వరుసగా 11:02 గంటలు, 12:51 గంటల సమయంలో ఉపగ్రహంలోని నాలుగు 11 న్యూటన్ థ్రస్టర్‌లను 20 నిమిషాల పాటు మండించినట్టు ఇస్రో తెలిపింది. చివరి పెరిజీ 80 కి.మీ కంటే తక్కువగా అంచనాకు వచ్చి, ఉపగ్రహం భూ వాతావరణంలోని దట్టమైన పొరల్లోకి ప్రవేశించి, తదనంతరం నిర్మాణాత్మక విచ్ఛిన్నానికి గురవుతుందని గుర్తించామని పేర్కొంది.

 
అలాగే, రీ-ఎంట్రీ ఏరో-థర్మల్ ఫ్లక్స్ విశ్లేషణ పెద్ద శకలాలు మిగిలి ఉండవని నిర్ధారించినట్టు వివరించింది. ఇప్పటి వరకూ చైనా, రష్యా, అమెరికాలు మాత్రమే ఇటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి. తాజాగా, ఆ దేశాల సరసన భారత్ నిలిచింది.