ప్రధాని మోదీపై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరల్లో ఒకరైన బిల్ గేట్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై భారత్ పై ప్రశంసలు కురిపించారు. అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, ప్రపంచానికే ఇప్పుడు భారత్ దిక్సూచిగా మారిందని ఆయన కొనియాడారు.

భారత్ సురక్షితమైన, నాణ్యమైన, ప్రభావవంతమైన, చవకైన టీకాలను ఉత్పత్తి చేసి, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజల ప్రాణాలను కాపాడుతోందని ప్రశంసించారు. అందులో కొన్ని వ్యాక్సిన్ల ఉత్పత్తిలో తమ గేట్స్ ఫౌండేషన్ సహకారం కూడా ఉందని పేర్కొన్నారు.

 కొరోనా మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో భారత్ చూపిన చొరప ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని చెప్పారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారత దేశం పరిష్కారంగా కనిపిస్తోందని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు, టెక్నాలజీ, వ్యవసాయం.. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధిని భారత్ సాధిస్తోందని ప్రశంసించారు.

 కొరోనాపై పోరుకు రూపొందించిన కోవిన్ ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్ భారతదేశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ఆధార్ సహాయంతో ప్రజలనందరిని సమ్మిళిత ఆర్థికాభివృద్ధిలో భాగం చేయడం భారత్ ఘనత అని తన బ్లాగ్ లో బిల్ గేట్స్ వివరించారు.

 

కొరోనా మహమ్మారి సమయంలోనూ, ఆ తరువాత కూడా ప్రధాని మోదీతో తరచూ టచ్ లో ఉన్నానని గేట్స్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ పాలు పంచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్ లో ఉన్న సమర్ధవంతమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, విజయవంతంగా దేశ పౌరులకు 2.2 కోట్ల డోసుల కొరోనా టీకాలను ఇవ్వగలిగిందని అభినందించారు.