నకిలీ వార్తల కాలంలో నిజం కూడా కష్టాలను ఎదుర్కొంటోంది

నకిలీ వార్తలు విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో నిజం కూడా కష్టాలను ఎదుర్కొంటోందని, విక్టిమ్‍గా మారుతోందని  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి సహనం లేకపోవడం ఆధునిక కాలంలో ఒకానొక పెద్ద సవాలుగా మారిందని ఆయన చెప్పారు. అమెరికన్ బార్ అసోసియేషన్ (ఇండియా) కాన్ఫరెన్స్ 2023 ప్రారంభ కార్యక్రమంలో ఢిల్లీలో “ప్రపంచీకరణ సమయంలో న్యాయం: భారత్, పశ్సీమల అనుసంధానం” అనే అంశంపై ప్రసంగించారు.
వ్యక్తిగత నమ్మకాలకు విరుద్ధమైన భావాలను కొందరు అసలు అంగీకరించే స్థితిలో లేరని ఆయన తెలిపారు. సోషల్ మీడియా ప్రస్తుతం విపరీతంగా వ్యాపించిందని, జడ్జిలు కూడా ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ లాంటి మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్స్ వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని జస్టిస్ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. వీటివల్ల భౌతిక దాడులు ఎదుర్కొంటున్నా వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి ఘటనలు సుప్రీం కోర్టు వరకు వచ్చాయి. వాటిపై చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశామని వివరించారు.
 
“నేను చెప్పేది నమ్మండి. దీనికి మేం (న్యాయమూర్తులు) మినహాయింపు కాదు. మేం చేసే ప్రతీ పనిని కొందరు ట్రోల్ చేస్తుంటారు. ప్రజలకు సహనం తక్కువగా ఉన్న కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. వారి అభిప్రాయాలకు భిన్నమైన మన దృక్కోణాన్ని ఇష్టపడేందుకు కొందరు సిద్ధంగా లేరు. అందుకే వారిలో సహనం తక్కువగా ఉంటోంది” అని ఆయన తెలిపారు.
“నేడు మన సమాజం ఎదుర్కొంటున్న ఘోర ప్రమాదం ఏమిటంటే, మనం ఇప్పుడు నిర్దేశించిన దానితో పోరాడలేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం  ఆవిర్భావం పరంగా ఇప్పుడు మానవత్వం తీసుకువచ్చిన మార్పు, కానీ ఇప్పుడు ఇది బహుశా మన నియంత్రణలో లేకుండా పోతోంది, ” అని ఆయన చెప్పారు. టెక్నాలజీ పర్యవసానాలు నియంత్రణ లేకుండా ఉండడం సమాజం ఎదుర్కొంటున్న ప్రమాదం అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.

కాగా, దేశంలో ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తులు ఉండాలన్న డిమాండ్‍ను కూడా సీజేఐ చంద్రచూడ్ ప్రస్తావించారు. “సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు ఎక్కువగా ఎందుకు లేరు, హైకోర్టులో ఎందురు లేరనే ప్రశ్నలు నాకు తరచూ ఎదురవుతుంటాయి. దీనికి సమాధానం అంత సులభం కాదు. సమాధానం కాస్త క్లిష్టంగా ఉంటుంది” అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.

సుప్రీం కోర్టుకు జడ్జిలు హైకోర్టుల నుంచే వస్తారని ఆయన తెలిపారు. ఈ తరం ప్రారంభంలో న్యాయవిభాగంలో కెరీర్ మొదలు పెట్టిన వారే 2023లో సుప్రీంకోర్టులో నియమితులవుతున్నారని తెలిపారు. అంటే రెండు దశాబ్దాల క్రితం మహిళా న్యాయమూర్తులుగా కెరీర్ మొదలు పెట్టిన వారు తక్కువగా ఉండడమే, ప్రస్తుతం సుప్రీంలో మహిళా జడ్జిలు తక్కువగా ఉండేందుకు కారణమేలా ఆయన అభిప్రాయపడ్డారు.

న్యాయవాద వృత్తిలో భిన్నత్వాన్ని పెంచేందుకు ఓ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాస్థాయిలో మహిళా జడ్జిల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. జిల్లా న్యాయ విభాగాల నియామకాల్లో ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో 50 శాతానికి కంటే ఎక్కువ మంది మహిళలు ఎంపికవుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళలకు విద్య ఎంత ఎక్కువ అందితే.. సమాజం అంత మెరుగవుతుందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.