షారుఖ్​ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై కేసు

టాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌పై లక్నోలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఓ ఫ్లాట్‌ విక్రయానికి సంబంధించి గౌరీ ఖాన్‌ తనను మోసం చేసిందని పేర్కొంటూ ముంబైకి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని  లఖ్‌నవూకు చెందిన తులసియానీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి గౌరీఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తోంది.
ఆమె ప్రచారం కారణంగా సదరు కంపెనీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దూసుకెళ్తోంది.  2015లో గౌరీఖాన్ లఖ్‌నవూకు చెందిన తులసియానీ కంపెనీని ప్రమోట్‌ చేశారు.  గౌరీ ఖాన్‌ ప్రకటన చూసిన ముంబై అంధేరీ ఈస్ట్ ప్రాంతానికి చెందిన జశ్వంత్‌ షా అనే వ్యక్తి లఖ్‌నవూలోని సుశాంత్‌ గోల్ఫ్‌ సిటీలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపించాడు. ఈ నేపథ్యంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియానీ, డైరెక్టర్ మహేష్ తులసియానీని సంప్రదించాడు.
 
రూ.86 లక్షలకు ఫ్లాట్‌ కొనుగోలుకు డీల్‌ ఫిక్స్‌ చేసుకున్నాడు. అయితే సకాలంలో ఫ్లాట్‌ను అతనికి అప్పగించడంలో సంస్థ జాప్యం చేసింది. ఎందుకు తనకు ఫ్లాట్ ఇవ్వడం లేదని ఆయన ఆరా తీయగా  అప్పటికే ఆ ఫ్లాట్‌ వేరొకరికి అమ్మినట్లు వెల్లడైంది. వెంటనే జశ్వంత్ సదరు కంపెనీపై కేసు పెట్టాడు. కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జశ్వంత్‌ 2015 ఆగస్టులో ఫ్లాట్‌ కోసం బ్యాంకు నుంచి రూ.85.46లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సదరు సంస్థకు చెల్లించాడు.
ఆ సమయంలో 2016 అక్టోబర్‌లో ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్​చేసి అప్పగిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అయితే చెప్పిన టైం దాటిపోయినా ఫ్లాట్‌ను అప్పగించకపోవడంతో ఎందుకు తనకు ఫ్లాట్‌ ఇవ్వలేదని బాధితుడు ఆరా తీశాడు. ఆ కంపెనీ ఫ్లాట్‌ను వేరొకరి పేరు మీద విక్రయించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గౌరీ ఖాన్, తులసియానీ కంపెనీ ఎండీ, డైరెక్టర్‌పై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జశ్వంత్‌ ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ తులసియానీ, మహేష్ తులసియానీ, గౌరీ ఖాన్‌లపై అక్రమాస్తుల సెక్షన్ల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సుశాంత్ గోల్ఫ్ సిటీ సీఐ శైలేంద్ర గిరి తెలిపారు.