మహిళల స్నూకర్‌ ప్రపంచకప్‌ టైటిల్‌

మహిళల స్నూకర్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను భారత్‌-ఏ జోడీ గెలుచుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్లో 4- 3 ఫ్రేముల తేడాతో 12సార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌-ఏపై సంచలన విజయం సాధించింది. భారత్‌-ఏ తరఫున అమీ కమానీా, అనుపమ రామచంద్రన్‌ జోడీ ప్రాతినిధ్యం వహించారు.
 
హోరాహోరీగా సాగిన ఫైనల్లో కమాన్ -అనుపమ జోడీ 4-3 (56-26, 67(51)-27, 41-61, 27-52, 68(34)-11, 55-64, 78-39) ఫ్రేముల తేడాతో ఇంగ్లండ్‌-ఏకు చెందిన రిన్నే ఎవాన్స్‌-రెబెక్కా కెన్నాలను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. రెబెక్కా కెన్నా ప్రపంచ 4వ ర్యాంకర్‌.
 
ఫైనల్లో విజయం తర్వాత కమానీ మాట్లాడుతూ  2011నుంచి తిరిగి స్నూకర్‌ ఆడడం ప్రారంభించానని, ఇది తన తొలి ప్రపంచకప్‌టైటిల్‌ అని, ఒక మ్యాజిక్‌లా అనిపిస్తోందని, కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉందని వెల్లడించింది. తొలి టోర్నమెంట్‌లోనే టైటిల్‌ విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉందని, వాతావరణం అలవాటు పడడానికి, టేబుల్‌పై సర్దుబాటు చేసుకొనేందుకు సమయం పట్టిందని అనుపమ తెలిపింది.
 

జాతీయ మహిళల బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా అనుపమ

 
కాగా, జాతీయ మహిళల బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా 18ఏళ్ల అనుపమ ఉపాధ్యాయ నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అనుపమ 20-22, 21-17, 24-22తో ఆకర్షీ కశ్యప్‌పై సంచలన విజయం సాధించింది. పూణే వేదికగా జరిగిన సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో మూడుసెట్ల హోరాహోరీ పోరులో ప్రపంచ జూనియర్స్‌ 3వ ర్యాంకర్‌ 21ఏళ్ల ఆకర్షీపై గెలిచింది.
 
పోటాపోటీగా సాగిన తొలి గేమ్‌లో అనుమప చివర్లో వరుసగా రెండు పాయింట్లు చేజార్చుకొని ఆ గేమ్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత డ్రాప్‌ షాట్లతో చెలరేగిన ఆకర్షీ.. ఓ దశలో 6-1పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పుంజుకున్న అనుపమ రెండో గేమ్‌ అర్ధభాగం ముగిసే సమయానికి 11-6 ఆధిక్యతలో నిలిచింది.
 
ఈ క్రమంలోనే ఆ గేమ్‌ను 21-17తో ముగించడంతో ఇరువురు షట్లర్లు ఒక్కో గేమ్‌ గెలిచి 1-1తో సమంగా నిలిచారు. ఇక మూడో గేమ్‌లో ఆకర్షీ ఓ దశలో 11-8పాయింట్ల ఆదిక్యతలోకి దూసుకెళ్లినా.. చివర్లో ఇరువురు షట్లర్లు 19-19తో సమంగా నిలిచారు. ఆ తర్వాత అనుపమ మెరుగైన ఆటతీరును ప్రదర్శించి వరుసగా రెండు పాయింట్లు గెలిచి ఆ గేమ్‌ను 24-22తో ముగించి నయా ఛాంపియన్‌గా అవతరించింది.