ప్రగతి పథంలో దూసుకుపోతున్న కర్ణాటక

కర్ణాటక రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. రైల్వే, రహదారి, విమాన-‘ఐ’ (డిజిటల్‌ సంధానం) మార్గాల ముందడుగుతో కర్ణాటక ప్రగతికి బాటలు పడ్డాయని ప్రధాని పేర్కొన్నారు. కర్ణాటక ప్రగతి రథాన్ని డబల్ ఇంజిన్ ప్రభుత్వం ముందుకు నడిపిస్తున్నదని ఆయన అభివర్ణించారు.

 ప్రధాని మోదీ సోమవారం కర్ణాటకలోని శివమొగ్గలో రూ.3,600 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించి, అక్కడి సదుపాయాలను పరిశీలించారు. దీంతోపాటు శివమొగ్గలో రెండు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటితోపాటు జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.950 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే పలు గ్రామీణ పథకాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కూడా చేశారు. అటుపైన శివమొగ్గ నగరంలో రూ.895 కోట్లతో చేపట్టిన 44 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో గ్రామాల నుంచి 2-3 అంచెల్లోని నగరాల దాకా విస్తృత ప్రగతిని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. లోగడ నగరాలు కేంద్రంగా అభివృద్ధిపై దృష్టి పెట్టేవారని, నేడు రెండు ఇంజన్ల ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రగతి రథాన్ని నడిపిస్తున్నదని ఆయన వివరించారు. “ఈ విధమైన ఆలోచన విధానానికి శివమొగ్గ అభివృద్ధే నిదర్శనం” అని ప్రధాని ఉదాహరించారు.

 దేశంలో విమానయానంపై ఎన్నడూ లేనంతగా ఉత్సాహం పొంగుతున్న నేపథ్యంలో శివమొగ్గలో విమానాశ్రయం ప్రారంభమైందని చెబుతూ ఇది కేవలం విమానాశ్రయం కాదని, యువత కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమమని చెప్పారు.ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రయాణ విమానం కొనుగోలుకు ఎయిరిండియా ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నదని ఆయన తెలిపారు.

కాగా, 2014లో కాంగ్రెస్‌ పాలన సమయాన ఎయిరిండియా గురించి ఎప్పుడూ ప్రతికూల ప్రస్తావనే వచ్చేదని గుర్తుచేశారు. అలాగే అనేక కుంభకోణాలకు అదొక ప్రతీకగా ఉండేదని, నష్టదాయక వ్యాపార వ్యూహానికి మచ్చుతునకలా భావంచబడేదని పేర్కొన్నారు.

అదే ఎయిరిండియా ఇవాళ, విజయ శిఖరాలకు చేరుతున్న నవ భారత సామర్థ్యానికి ప్రతీకగా మారిందని చెప్పారు. భారత వైమానికి మార్కెట విస్తరణను ప్రస్తావిస్తూ సమీప భవిష్యత్తులోనే దేశానికి వేలాది విమానాలు అవసరం కాగలవని, వాటిని నడిపించగల యువశక్తి కూడా వేల సంఖ్యలో కావాల్సి ఉంటుందని చెప్పారు. ఇక మనం నేడు విమానాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్‌లో తయారైన విమానాల్లో దేశ పౌరులు ప్రయాణించే రోజు ఎంతోదూరంలో లేదని ప్రధాని వ్యాఖ్యానించారు.

దేశంలో వైమానిక రంగం అనూహ్య విస్తృతికి దోహదం చేసిన ప్రభుత్వ విధానాల గురించి ప్రధానమంత్రి వివరించారు. గత ప్రభుత్వాల తరహాలో కాకుండా ప్రస్తుత ప్రభుత్వం చిన్న నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ముందడుగు వేసిందని ఆయన తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక 2014 వరకూ 7 దశాబ్దాల తర్వాత దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 మాత్రమేనని ప్రధాని గుర్తుచేశారు.

కానీ, కేవలం గడచిన 9 సంవత్సరాల్లోనే అనేక చిన్న నగరాలను కలుపుతూ మరో 74 విమానాశ్రయాలు నిర్మితమయ్యాయని పేర్కొన్నారు. అలాగే హవాయి చెప్పులు ధరించే సామాన్యులు కూడా హవాయి జహాజ్‌ (విమానం)లో ప్రయాణించగలగాలనే తన దృక్పథానికి అనుగుణంగా సరసమైన విమాన ప్రయాణం కోసం ‘ఉడాన్’ పథకం ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు.