మరోసారి రాజకీయ సంక్షోభంలో నేపాల్

నేపాల్‌ మరోసారి రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రధాని పుష్ప కమల్‌ దాహల్‌ (ప్రచండ) నేతృత్వంలోని ప్రభుత్వానికి సిపిఎన్‌ (యుఎంఎల్‌) మద్దతు ఉససంహరించుకుంటున్నట్టు సోమవారం ప్రకటించడంతో సంక్షోభం తలెత్తింది. 275 స్థానాలు ఉన్న పార్లమెంటులో 79 సీట్లతో కెపి ఓలి నాయకత్వంలోని సిపిఎన్‌ (యుఎంఎల్‌) రెండవ అతి పెద్ద పార్టీగా ఉంది.
 
సిపిఎన్‌ (యుఎంఎల్‌) ఉపాధ్యక్షుడు బిష్టు రైజాల్‌ మాట్లాడుతూ, నేపాల్‌ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ (నేపాలీ కాంగ్రెస్‌) అభ్యర్థికి మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలిపారు. అయితే,  89 స్థానాలతో పార్లమెంటులో ఏకైక అతి పెద్ద పార్టీగా ఉన్న నేపాలీ కాంగ్రెస్‌ ఆయనకు మద్దతు తెలపడంతో ప్రచండ ప్రభుత్వానికి తక్షణం వచ్చే ముప్పేమే లేదు.
 
ప్రధాని ప్రచండ ఏడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబరు 25న కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాదు, సిపిఎన్‌ (యుఎంఎల్‌)కు ద్రోహం చేశారని రైజాల్‌ పేర్కొన్నారు. ఉప ప్రధానితో సహా ఎనిమిది మంది యుఎంఎల్‌ మంత్రులు ప్రచండ ప్రభుత్వం నుంచి మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
 
కాగా,  టివి జర్నలిస్టు రవి లామిచానే నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఈ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్‌ బిరాజ్‌ భక్త శ్రేష్ట చెప్పారు. పార్లమెంటులో ప్రస్తుతానికి వివిధ పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి:
 
నేపాలీ కాంగ్రెస్‌ (ఎన్‌సి)-89, సిపిఎన్‌ (యుఎంఎల్‌)-79, ప్రచండ నేతృత్వంలోని సిపిఎన్‌ (మావోయిస్టు సెంటర్‌) – 32, మాజీ ప్రధాని మాధవ కుమార్‌ నేతృత్వంలోని సిపిఎన్‌ (యునైటెడ్‌ సోషలిస్టు)-10, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ-20, జనమత్‌ పార్టీ-6, లోక్‌తాంత్రిక్‌ సమాజ్‌వాది పార్టీ -4, నాగరిక్‌ ఉన్‌ముక్తి పార్టీ -3 స్థానాలు కలిగి ఉన్నాయి.
 
ప్రచండ ప్రభుత్వం నిలబడాలంటే కనీసం 138 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఆయనకు 141 మంది మద్దతు ఉంది. .ప్రచండకు మద్దతు ఇస్తున్న మూడు ప్రధాన పార్టీలు – ఎన్‌సి, సిపిఎన్‌ మావోయిస్టు సెంటర్‌, ఆర్‌ఎస్‌పి రాజకీయంగా భిన్న ధ్రువాలు కలిగినవి. వీటి మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగే స్థితి లేదని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రచండ వచ్చే నెల రోజుల్లో పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణులు పేర్కొన్నారు.