ఛత్తీస్‌గఢ్‌లో 8 మంది మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి !

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు, ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు నేత అగ్రనేత ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  రాష్ట్ర రాజధాని రాయపూర్‌కు 400 కి.మీ. దూరంలోని జగర్‌గుండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జిల్లా రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ)కి చెందిన ఓ జట్టు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మావోయిస్టులతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

బస్తర్‌ ఐజి సుందరరాజ్‌ కథనం ప్రకారం… సుక్మా జిల్లా జేగురుకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. వారికి కుందేడ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరుగ్రూపుల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. మూడు గంటలసేపు భయానక వాతావరణం నెలకొంది.

ఈ కాల్పుల్లో ఎఎస్‌ఐ రామురామ్‌నాగ్‌, అసిస్టెంట్‌ కానిస్టేబుల్‌ కుంజం జోగా, కానిస్టేబుల్‌ వంజం భీమా మృతి చెందారు. ఈ ఘటనలో ఎనిమిది మావోయిస్టులు చనిపోయారని, వారిలో ఓ అగ్రనేత ఉన్నాడని, మావోయిస్టుల మృతదేహాలను వారి సహచరులు అడవిలోకి మోసుకుపోయారని ఐజి సుందరరాజ్‌ తెలిపారు.

తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అన్వేషిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కుందేడ్‌ అటవీ ప్రాంతంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోన్న భయానక వాతావరణం నెలకొంది. ఈనెల 20న రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో మావోయిస్టుల దాడిలో ఇద్దరు పోలీసులు చనిపోయారు.