ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక కశ్మీరీ పండిట్‌ మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు  మరోసారి పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక కశ్మీరీ పండిట్‌ మరణించాడు. పుల్వామా జిల్లాలో  అచ్చన్‌ ప్రాంతానికి చెందిన కశ్మీరీ పండిట్‌ సంజయ్ శర్మ ఆదివారం ఉదయం స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు.
 
తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే సంజయ్‌ శర్మ మరణించినట్లు చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన మృతుడు సంజయ్‌ శర్మ స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.
 

ఈ సంఘటన నేపథ్యంలో మైనార్టీలైన హిందువులున్న ఆ గ్రామంలో సాయుధ పోలీసులను మోహరించినట్లు చెప్పారు. అదనపు బలగాలను రప్పించి ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్‌ సంజయ్‌ శర్మపై ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.మరోవైపు ఉగ్రవాదులు ఇటీవల కాలంలో పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

గత నాలుగు నెలల్లో హిందువులపై ఉగ్రవాదులు జరిపిన తొలి దాడి ఇది. అలాగే స్థానిక కశ్మీరీలను లక్ష్యంగా చేసుకున్న రెండో దాడి. ఇటీవల అనంత్‌నాగ్‌లో ఆసిఫ్ అలీ గనాయ్‌పై ఒక ఉగ్రవాది కాల్పులు జరుపడంతో అతడు గాయపడ్డాడు. పోలీస్‌ హెడ్ కానిస్టేబుల్ అయిన ఆయన తండ్రి గత ఏడాది ఉగ్రవాదుల దాడిలో మరణించాడు.

 గతేడాది కశ్మీరీ పండిట్లు, స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పలు దాడులకు తెగబడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో బుద్గామ్‌ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ కశ్మీరీ పండిట్‌ను దారుణంగా హత్యచేశారు. దీంతో లోయ వ్యాప్తంగా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆ సామాజిక వర్గం ఆందోళనకు దిగింది.