హైదరాబాద్ లో బాలలపై కుక్కల మూకుమ్మడి దాడులు

హైదరాబాద్ లో బాలలపై కుక్కల మూకుమ్మడి దాడులు
అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్న హైదరాబాద్ మహానగరంలో కుక్కలను చూసి పిల్లలే కాకుండా పెద్దవారు కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ, మూకుమ్మడి దాడులకు పాల్పడుతూ ఉండడంతో వీధులలోకి వెళ్లే బాలల గురించి తల్లిదండ్రులు భయకంపితులవుతున్నారు.
 
బాగ్​అంబర్ పేటలో కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేండ్ల బాలుడు మంగళవారం చనిపోవడంతో జనం భయపడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. వార్తాపత్రికల కధనాల ఆధారంగా రాష్ట్ర హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు చేపట్టింది.  బుధవారం సహితం వేర్వేరు ప్రాంతాలలో నలుగురు బాలలు కుక్కల దాడులలో గాయాలకు గురయ్యారు. అన్ని ఏరియాల నుంచి జీహెచ్ఎంసీకి అధికారులకు బుధవారం ఒక్కరోజే ట్విట్టర్, మై జీహెచ్ఎంసీ యాప్, హెల్ప్ లైన్ నంబర్లకు వందల్లో ఫిర్యాదులు వచ్చాయి.
బాగ్ అంబర్ పేటలో ఉంటున్న గంగాధర్.. తన కొడుకు ప్రదీప్ ను సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ్నుంచి గంగాధర్ వెళ్లిపోగా.. అప్పుడే నడుచుకుంటూ బయటకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు ముట్టడించి దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత బాలున్ని రెండు కుక్కలు నోట కరచుకుని చెరోవైపు లాగడంతో చనిపోయాడు.
 
అప్రమత్తమైన ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ మాసబ్ ట్యాంక్ లోని సీడీఎంఏ ఆఫీసులో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.  గ్రేటర్​లో ప్రస్తుతం ఐదున్నర ల‌‌‌‌క్షల వీధి కుక్కలు ఉన్నాయ‌‌‌‌ని, వాటిని గుర్తించి ఏబీసీ(యానిమల్‌‌‌‌ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేష‌‌‌‌న్ ఆప‌‌‌‌రేష‌‌‌‌న్లు చేయాలని ఆయన  ఆదేశించారు. కాలనీల్లో కుక్కల కోసం నీటిని నిల్వ ఉంచేలా చూడాలని చెప్పారు.
 
హోట‌‌‌‌ల్స్‌‌‌‌, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, చికెన్, మ‌‌‌‌ట‌‌‌‌న్‌‌‌‌ సెంట‌‌‌‌ర్ల నిర్వాహకులు వ్యర్థాలను రోడ్ల వెంట పోయకుండా క‌‌‌‌ట్టడి చేయాల‌‌‌‌న్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో అవ‌‌‌‌గాహ‌‌‌‌న కార్యక్రమాలు నిర్వహించాల‌‌‌‌ని చెప్పారు. పాంప్లెట్లు, హోర్డింగ్స్ రెడీ చేయాలని ఆదేశించారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారంతో కుక్కల నియంత్రణ చ‌‌‌‌ర్యలు తీసుకోవాలని సూచించారు.
 
పెంపుడు జంతువుల న‌‌‌‌మోదుకు స్పెషల్​యాప్​రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ ప‌‌‌‌రివాహ‌‌‌‌క ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. వీధి కుక్కల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ బేగంబజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఆ పార్టీ లీడర్లు  కొప్పుల నర్సింహారెడ్డి, డాక్టర్ సురేఖ, రాధాధీరజ్ రెడ్డి, శ్రావణ్, హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, హబ్సిగూడ కార్పొరేటర్ చేతన మేయర్​విజయలక్ష్మిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు.
 
ఎండలు ముదిరితే కుక్కలు మరింత  రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడి మృతికి జీహెచ్ఎంసీ బాధ్యత వహించాలని, వెంటనే అతని కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం అందించాలని వారు డిమాండ్​చేశారు.
 
అలాగే మణికొండ మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఫల్గుణ కుమార్‌‌‌‌ బుధవారం స్థానిక ఆఫీసులో బ్లూక్రాస్‌‌‌‌ సోసైటీ, మణికొండ జంతు సంరక్షణ వలంటీర్స్‌‌‌‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి కుక్కలు సంచరించే చోట వాహనాలు వేగంగా నడపడం, వాటిపై రాళ్లను విసరడం వంటివి చేయకూడదని సూచించారు.