రాజకీయ ప్రత్యర్థులపై గూఢచర్యం… సిసోడియాపై మరో దర్యాప్తు!

ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిండా మునిగిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్ అగ్రనేత మనీశ్‌ సిసోడియాపై మరో కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ (ఎ్‌ఫబీయూ) ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన్ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు కేంద్ర హోం శాఖ సీబీఐకి అనుమతి మంజూరు చేసింది.

అవినీతి నిరోధక చట్టం (1988)లోని 17వ సెక్షన్‌ ప్రకారం ఈ అనుమతి ఇస్తున్నట్లు ఢిల్లీ లెఫ్టినెంట్‌ జనరల్‌ (ఎల్‌జీ) వీకే సక్సేనాకు లేఖ రాసింది. అవినీతి నిరోధక శాఖపై ఎల్‌జీకే తప్ప ఢిల్లీ ప్రభుత్వానికి అజమాయిషీ లేదని కోర్టు స్పష్టం చేయడంతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజిలెన్స్‌ శాఖలో సొంత దర్యాప్తు విభాగం ఏర్పాటు చేయాలని భావించారు.

ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని శాఖలు, స్వతంత్ర సంస్థలు, ఇతర విభాగాల్లో అవినీతి కట్టడిని పర్యవేక్షించేందుకు ఎఫ్‌బీయూ ఏర్పాటును 2015 సెప్టెంబరు 29న కేబినెట్‌ భేటీలో ప్రతిపాదించారు. ఎజెండా నోట్‌లో ఈ అంశం లేకపోయినా మంత్రివర్గం ముందు పెట్టి ఆమోదించుకున్నారు.  2016 ఫిబ్రవరిలో ఇది పని చేయడం ఆరంభించింది. ఇందులో 17 మంది కాంట్రాక్టు సిబ్బందిని నియమించారు. సీక్రెట్‌ సర్వీసు వ్యయం కింద రూ.కోటి మంజూరు చేశారు. అయితే ఎఫ్‌బీయూలో నియామకాలకు ఎల్‌జీ నుంచి అనుమతి తీసుకోలేదు.

ఆ తర్వాత ఈ యూనిట్‌లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్‌ శాఖ ఫిర్యాదు చేయడంతో సీబీఐ ప్రాథమిక విచారణను రిజిస్టర్‌ చేసింది. 2016 ఫిబ్రవరి నుంచి 2017 ఫిబ్రవరి వరకు ఎఫ్‌బీయూ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించింది. ఆ సమాచారంలో 60 శాతం విజిలెన్స్‌, అవినీతి వ్యవహారాలకు సంబంధించినవి కాగా.. 40 శాతం రాజకీయ నిఘాకు సంబంధించినవి.

ప్రత్యర్థులపై సిసోడియా రాజకీయ నిఘా పెట్టి ఈ సమాచారం సేకరించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సీబీఐ ఈ ఏడాది జనవరి 12న విజిలెన్స్‌ శాఖకు నివేదించింది. ఎఫ్‌బీయూ ఏర్పాటే అక్రమమని.. ఆ విభాగం తన విధుల పరిమితిని అతిక్రమించి రాజకీయ వ్యక్తులపై నిఘా పెట్టిందని తెలిపింది. దాని కార్యకలాపాల వల్ల ఖజానాకు రూ.36 లక్షల నష్టం జరిగిందని పేర్కొంది.

ఎఫ్‌బీయూ ఢిల్లీ విజిలెన్స్‌ శాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ సిసోడియా పర్యవేక్షణలో ఉండడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సీబీఐ సిఫారసు చేసింది. ఇప్పుడు ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతివ్వడంతో సిసోడియాతో పాటు ఐదుగురు ప్రభుత్వ అధికారులు/సలహాదార్లు ఆర్‌కే సిన్హా, ప్రదీ్‌పకుమార్‌ పంజ్‌, సతీశ్‌ ఖేత్రపాల్‌, గోపాల్‌ మోహన్‌, సుకేశ్‌కుమార్‌ జైన్‌పై కేసు నమోదుకు ఎల్‌జీ ఆమోదముద్ర వేశారు. సిసోడియా మద్యం కుంభకోణంలో ఈ నెల 26న సీబీఐ విచారణకు హాజరు కావలసి ఉంది.