
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమౌతున్నాయని పేర్కొంటూ అయితే మోదీని ఓడించడం ఎవరి తరమూ కాదని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. మహారాష్ట్ర కోల్హాపూర్‌లో జరిగిన బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో మాట్లాడుతూ బీజేపీ సమృద్ధ భారత నిర్మాణం చేస్తుందని తెలిపారు.
రాబోయేవి మోదీని తిరిగి గెలిపించే ఎన్నికలు మాత్రమే కావని, సమృద్ధ భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ఎన్నికలని షా చెప్పారు. బీజేపీ ఆధునిక, సాంస్కృతిక భారత్‌ను నిర్మిస్తుందని తెలిపారు. 2014కు ముందు ప్రతి మంత్రి తనను తాను ప్రధానిగా భావించుకునేవారని, అవినీతి తీవ్రంగా ఉండేదని షా ఆరోపించారు.
ఉగ్రవాదులు రెచ్చిపోతున్నా, మన సైనికులను ఉచకోతకొస్తున్నా చోద్యం చూస్తుండిపోయేవారని షా గత పాలకులను ఎద్దేవా చేశారు. 2014కు ముందు శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన వాపోయారు. శివాజీ జయంతి వేళ అమిత్ షా శివాజీ సాహసాలను కొనియాడారు. భారతమాత బానిస శృంఖలాలను తెంచేందుకు శివాజీ వీరోచితంగా పోరాడారని షా కీర్తించారు.
మోదీ ప్రభుత్వంలో కాశ్మీర్ లో ఉగ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో తీవ్ర వాదం, దేశంలో వామపక్ష హింసాయుత సంఘటనలలో 80 శాతం మేరకు తగ్గుదల కనిపిస్తున్నదని ఆయన గుర్తు చేశారు.
మోదీ హయాంలో రక్షణ, విదేశీ నీతి అత్యంత ప్రభావవంతంగా ఉందని పేర్కొంటూ కొందరు అధికారం కోసం సిద్ధాంతాలు వదిలిపెట్టారంటూ అమిత్ షా శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరేపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో కలిసి పోటీచేసి అధికారం కోసం తమ ప్రత్యర్థులతో షా చేతులు కలపడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. అయితే ప్రస్తుతం విల్లు, బాణంతో అసలైన శివసేన మళ్లీ బీజేపీతో కలిసిపోయిందని షా చెప్పారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ఏక్‌నాథ్ శిండేతో కలిసి వెళ్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల గుర్తు కేటాయింపుపై ఎన్నికల కమీషన్ పై ఉద్ధవ్ థాకరే వర్గం చేస్తున్న విమర్శలను కొట్టిపారవేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగానే ఉంటుందని, ఆ విషయం తెలియకుండా ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు చెప్పారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే