భారతదేశంలో చిరుత పులుల జాతి అంతరించిపోతున్న కారణంగా, గత సంవత్సరం ప్రతిష్టాత్మకమైన ‘చిరుత పునరుద్ధరణ కార్యక్రమం’ కింద ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజున సందర్బంగా నమీబియా నుండి ఎనిమిది చిరుతలను (ఐదు ఆడ, మూడు మగ) కునో నేషనల్ పార్క్‌లోని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి దిగుమతి చేశారు.
కాగా, ఈ ఏడాది మరిన్ని చిరుత పులులు భారత్ కు రానున్నాయి. ఈ నెల 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను రప్పించనున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం, కునో వద్ద ఉన్న ఎనిమిది చిరుతలు ప్రతి మూడు-నాలుగు రోజులకు ఒక సారి వేటాడుతూ, మంచి ఆరోగ్యంతో ఉన్నాయని అధికారులు తెలిపారు.
అయితే, చిరుతల్లో ఒకదాని క్రియాటినిన్ లెవల్స్ పెరగడంతో అస్వస్థతకు గురైందని చికిత్స అనంతరం కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పులులను అతిగా వేటాడటం కారణంగా భారతదేశం నుండి పూర్తిగా అంతరించిపోయిన ఏకైక పెద్ద మాంసాహార జాతి చిరుత పులులదే అని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలోని సాల్ అడవుల్లో చివరిగా కనిపించిన ఈ పిల్లి జాతికి చెందిన ఓ చిరుత 1948లో మరణించింది.
ప్రపంచంలోని మొత్తం 7000 చిరుతల్లో అధిక భాగం దక్షిణాఫ్రికా, నమీబియా అండ్ బోట్స్వానాలో నివసిస్తున్నాయి. అత్యధికంగా చిరుతలను కలిగి ఉన్న దేశంగా నమీబియా గుర్తింపు పొందింది. దీంతో భారతదేశం-దక్షిణాఫ్రికా మధ్య జనవరిలో చిరుతల రవాణాపై ఒక ఒప్పందం కుదిరింది.
దానికి సంబందించి “ఫిబ్రవరిలో 12 చిరుతలను దిగుమతి చేసుకున్న తరువాత, రానున్న 8- 10 సంవత్సరాలకు ఏటా 12 చిరుతలను బదిలీ చేయాలనేది ప్రణాళిక. ఈ ఒప్పందానికి సంబందించిన ఎమ్ఒయు నిబంధనలు సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి సమీక్షించబడతాయి” అని పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన ‘ఆక్షన్ ప్లాన్ ఫర్ రీ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియా’ ప్రకారం, భారత్ లో కొత్త చిరుత జనాభాను పెంచడానికి అనువైన 12-14 అడ చిరుతలను దక్షిణాఫ్రికా, నమీబియా, ఇతర ఆఫ్రికా దేశాల నుండి దిగుమతి చేసుకుంటారు.
More Stories
ఢిల్లీలోని 40కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు
పోలీసుల మధ్య కాల్పులు .. ఉదంపూర్‌లో ఇద్దరు పోలీసులు మృతి
ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడటంతో ఆంక్షల సడలింపు