చైనా సరిహద్దులో కీలక ప్రాజెక్ట్ కు మంత్రివర్గం ఆమోదం

చైనా- భారత్ సరిహద్దుల్లో రెండేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో  సరిహద్దు ప్రాంతాల భద్రతకు సంబంధించి కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ కార్యక్రమానికి రూ.4800 కోట్లు కేటాయించినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబడుతుందని కేంద్రమంత్రి తెలియజేశారు.

ఇందుకోసం రూ.4800 కోట్ల కేటాయింపు జరిగిందని, ఇందులో రోడ్ల నిర్మాణానికి రూ.2500 కోట్లు వెచ్చించనున్నారని వివరించారు. దేశపు ఉత్తర సరిహద్దు వ్యూహాత్మక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఠాకూర్ చెప్పారు. దీనితో ఈ సరిహద్దు గ్రామాలలో భరోసా జీవనోపాధిని అందించవచ్చని చెప్పారు. ఇది వలసలను ఆపడానికి సహాయపడుతుందని… దీంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కూడా పటిష్టం చేయనున్నారు.

దేశంలోని ఉత్తర భూ సరిహద్దు వెంబడి ఉన్న 19 జిల్లాలు, 46 బోర్డర్‌ బ్లాక్‌లు, 1 యుటిలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవనోపాధి అవకాశాల కల్పన కోసం ఈ పథకం నిధులను అందిస్తుందని తెలిపారు. ఇది సమ్మిళిత వృద్ధిని సాధించడంలోనూ, సరిహద్దు ప్రాంతాల్లో జనాభాను నిలుపుకోవడంలోనూ సహాయపడుతుందని, మొదటి దశలో 663 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

గ్రామ పంచాయతీల సహాయంతో జిల్లా పరిపాలన యంత్రాంగం వైబ్రెంట్‌ విలేజ్‌ యాక్షన్‌ ప్లాన్‌లు రూపొందిస్తుందని, కేంద్ర, రాష్ట్ర పథకాలు 100 శాతం అమలు జరుగుతాయని అన్నారు. ఆర్థిక కేటాయింపుల్లో రూ. 4,800 కోట్లలో రోడ్ల కోసం రూ.2,500 కోట్లు వినియోగిస్తామని తెలిపారు.

అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ కార్యక్రమం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జీవనోపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది ఉత్తర సరిహద్దు ప్రాంతంలో సమ్మిళిత అభివృద్ధిని నిర్ధారించంతోపాటు ఇక్కడ నివసించే ప్రజలకు నాణ్యమైన అవకాశాలను అందిస్తుంది.