‘కాంతార’ హీరోకి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అవార్డు

‘కాంతార’ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టికి ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ‘కాంతార’ విజయాన్ని ఆస్వాదిస్తుండగానే రిషబ్ శెట్టి ఆ చిత్రానికి గాను ఓ పురస్కారాన్ని గెలుపొందారు.

రిషబ్ తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును గెలుచుకున్నారు. ‘కాంతార’ లోని నటనకు గాను ఈ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. అంతకు ముందు రిషబ్ కొంత మంది సినీ ప్రముఖులతో కలసి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

కర్ణాటక రాజ్ భవన్‌లో మోదీ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ విందుకు విజయ్ కిరంగదూర్, యష్, అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, శ్రద్ధ్రా జైన్ తదితరులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలను రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. భారత్, కర్ణాటక అభివృద్ధిలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ పాత్రపై చర్చించినట్టు పేర్కొన్నారు.

‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో ప్రస్తుతం రిషబ్ శెట్టి ‘కాంతార 2’ పై పనిచేస్తున్నారు. ‘కాంతార 2’ అనేది సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని ఆయన చెప్పారు. తొలి భాగం ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను రెండో భాగంలో చూపించనున్నట్లు పేర్కొన్నారు.

పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ‘కాంతార’ రెండో భాగం 2024లో విడుదలవుతుందని స్పష్టం చేశారు. ‘కాంతార’ ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపించనున్నారు. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద ఆవిష్కరిస్తోందని పేర్కొన్నారు.