మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.1398.83 కోట్లతో రోడ్లు 

మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తుంది. తీవ్రవాద ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా అమలుచేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అనేక పథకాలను కేంద్రం అమల్లోకి తెచ్చింది.

మావోయిస్టు ప్రేరిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు, మొబైల్‌ టవర్లు, బ్యాంకులు, పోస్టాఫీీసుల ఏర్పాటుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. స్కీల్‌ డెవెలఫ్మెంట్‌ సెంటర్ల ద్వారా ఉద్యోగాలకల్పనకు, విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్రం నిధులు విడుదల చేయడంతో పాటుగా క్షేత్ర స్థాయిలో నిఘాను పెంచినట్లు సమాచారం. నక్సలైట్ల కదలికలపై గ్రామ ప్రజలతో పోలీసులు సంబంధాలు ఏర్పర్చుకుని యువతను ఉపాధివైపు మళ్లిస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో వ్యయాన్ని పెంచుకుంటూ రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మారుమూల ప్రాంతాలకు, తీవ్రవాద ప్రభావిత గ్రామాలకు రహదారుల సౌకర్యాలు మెరుగుపరిస్తే పట్టణాలతో సంబంధాలు ఏర్పడి యువత విప్లవం వైపు వెళ్లవద్దనే లక్ష్యంతో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుంది.

ప్రస్తుతం నక్సలైట్ల ప్రభావిత జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ మంచిర్యాల,కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని అడవిప్రాంతాల్లోని గ్రామాలకు కేంద్ర నిధులతో రహదారుల పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించేందుకు ప్రతిపాదించిన రూ.1398.83 కోట్లకు ప్రతిపాదనను కేంద్ర ఆమోదించింది.

ఎండిఆర్‌ ప్రణాళిక కింద భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాదు జిల్లాల్లో రూ.139.00 కోట్ల వ్యవయంతో 92 కిలోమీటర్ల పొడవు గల 14 పనులకు, వంతెనల నిర్మాణానికి నిధులను కేంద్రం కేటాయించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 714 కి.మీ. పొడవు గల 143 రోడ్లు, 91 వంతెనలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వామపక్ష తీవ్ర వాద ప్రగతి పద్దుకింద రూ.497.77 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. గ్రామీణ ప్రాంతంరోడ్లు, వంతెనల నిర్మాణం పనులు ప్రభుత్వం ప్రారంభించింది.ఆర్డీఎఫ్‌ పథకం కింద 1051.11 కి.మీ.పొడవున రోడ్లు, 44 వంతెనల ను నిర్మించేందుకు రూ.899.40కోట్ల వ్యయం కాగల 233పనులను ప్రభుత్వం చేప్టటింది.

అలాగే ఆర్డీఎఫ్‌ పథకం ద్వారా రూ.671.03 కోట్ల వ్యయంతో 170 పనులు పూర్తి అయినట్లు సంబంధిత శాఖల అధికారులు తెలిపారు. అలాగే వంతెనలు, రిజర్వాయర్లు, నిర్మించి వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించి అనేక ప్రాజెక్టులకు రూపకల్పనచేస్తున్నారు.